ఈమధ్య తెలుగులో ఓ ట్రెండ్ మొదలైంది గమనించారా? తమిళ హీరోలు ఇక్కడ విరివిగా సినిమాలు చేస్తున్నారు. ధనుష్, సూర్య ఇప్పటికే తెలుగు సినిమాలు చేశారు… కొత్తగా కమిట్ అయ్యారు. కార్తి, శివ కార్తికేయన్లూ తెలుగు సినిమాలవైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇద్దరూ ఇది వరకే తెలుగులో నటించారు. ఇప్పుడూ వాళ్లకు అవకాశాలు వస్తున్నాయి. విజయ్ సేతుపతి అయితే తరచూ కనిపిస్తూనే ఉన్నాడు. పూరి సినిమాలో ఇప్పుడు తనే హీరో. మరికొంతమంది తమిళ హీరోలు కూడా తెలుగు నిర్మాతలతో టచ్లో ఉన్నారు.
ఈ ట్రెండ్ కు ఓ కారణం ఉంది. తెలుగులో హీరోలంతా బాగా బిజీ అయిపోయారు. ఓ మోస్తరు హీరో సైతం అందుబాటులో లేకుండా పోయాడు. ఫ్లాప్ లు ఉన్నా, సినిమాలు ఎక్కువ చేరిపోతున్నాయి. దాంతో తమిళ హీరోలవైపు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే కాదు… తమిళ హీరోలు కథ ఓకే చేశాక, దర్శకుడి పనిలో జోక్యం చేసుకోరు. మనవాళ్లు అలా కాదు. ప్రతీదీ వాళ్ల అదుపు ఆజ్ఞల్లోనే జరగాలి అంటారు. దానికి తోడు.. తెలుగు – తమిళ భాషల్లో సినిమాకు మార్కెట్ ఉంటుంది. అందుకే మన నిర్మాతలు అటు వైపు మొగ్గు చూపిస్తున్నారు. తమిళ హీరోలకూ తెలుగు సినిమాలంటే ఆసక్తి పెరగడానికి కారణం.. ఇక్కడ రెమ్యునరేషన్లు అధికంగా ఉండడమే. పని వేళ్లల్లోనూ సౌలభ్యాలు ఉన్నాయి. మార్కెట్ ని కూడా విస్తరించుకోవొచ్చు.
కాకపోతే.. ఇక్కడ ఓ విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోంది. తమిళ హీరోలు తెలుగులో నటించిన సినిమాలకు తమిళంలో పెద్దగా ఆదరణ దక్కడం లేదు. ధనుష్ నటించిన `కుబేర` తెలుగులో హిట్టు. తమిళంలో డిజాస్టర్. ధనుష్ అక్కడి హీరోనే. కానీ ఎవరూ పట్టించుకోలేదు. `కుబేర`ని ఓ తెలుగు డబ్బింగ్ సినిమాగా భావించారు తమిళవాళ్లు. ఇది వరకు శివ కార్తికేయన్ చేసిన `ప్రిన్స్`కీ ఇదే పరిస్థితి. సో.. తమిళ హీరోలతో సినిమాలు చేసినా, తమిళంలో వసూళ్లు వస్తాయని ఆశించకూడదు. వస్తే బోనస్ అనుకోవాలంతే. అలా అనుకోగలిగితేనే తమిళ హీరోలతో ప్రొసీడ్ అవ్వడం బెటర్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.