తమిళనాడులో ఇప్పుడు చర్చ అంతా దేవుడి దీపం గురించే జరుగుతోంది. ఈ వివాదంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ పక్ష పార్టీలు ఫైర్ అవుతున్నాయి. ఓ హైకోర్టు జడ్జిని కూడా తొలగించాలని కాంగ్రెస్ కూటమి లోక్ సభ స్పీకర్ కు.. అభిశంసన నోటీసు కూడా ఇచ్చింది. ఈ వివాదంలో విజయ్ ఇంకా నోరు మెదపలేదు. కానీ ఈ దీపం మాత్రం ఇలా అంటుకోవడానికి ప్రధాన కారణంగా ఓ న్యాయమూర్తి నిలవడమే ఆశ్చర్యకరం.
తిరుపరంకుండ్రం ఆలయం దీపం వివాదం
తిరుపరంకుండ్రం శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయంలో కార్తీక దీపాన్ని ఎక్కడ వెలిగించాలన్న వివాదం 1920 నుంచి ఉంది. భక్తులు అనాదిగా ఆలయం కింది భాగంలోని కోవిల్ మండపం సమీపంలో దీపం వెలిగిస్తారు. కానీ కొండపైన వెలిగించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. కోర్టుల్లోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. 1994లో ఒక భక్తుడు కొండపైకి మార్చాలని కోర్టుకు వెళ్లాడు. 1996లో మద్రాస్ హైకోర్టు సాధారణంగా మండపం వద్దే దీపం వెలిగించాలి అని తీర్పు ఇచ్చింది. ఇది ఏకైక చట్టపరమైన ఆర్డర్. దాంతో కిందనే దీపాన్ని వెలిగిస్తున్నారు.
పైన వెలిగించాలని తీర్పు ఇచ్చిన మధురై హైకోర్టు జడ్జి
తాజాగా హిందూ తమిళర్ కచ్చి స్థాపకుడు రామ రవికుమార్ కొండపై దీపం వెలిగిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ జడ్జి జీ.ఆర్. స్వామినాథన్ డిసెంబర్ 1న అనుకూలంగా తీర్పు ఇచ్చారు. తమిళనాడు ప్రభుత్వం ఈ ఆర్డర్‌కు వ్యతిరేకంగా అప్పీల్ చేసి.. పైన దీపాన్ని వెలిగించడాన్ని అడ్డుకుంది. రవికుమార్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో న్యాయమూర్తి సిఐఎస్ఎఫ్ రక్షణలో 10 మంది భక్తులతో దీపారాధన చేయాలని ఆదేశించారు. కానీ పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. న్యాయమూర్తి తన పరిధిని దాటారని డీఎంకే ఇంపీచ్ మెంట్ పిటిషన్ వేసింది. మరో వైపు సుప్రీంకోర్టునూ ఆశ్రయించింది.
ఆ ఆలయం వద్ద ఓ దర్గా కూడా ఉండటం అసలు రాజకీయానికి కారణం.
తిరుపరంకుండ్రం హిల్‌లో ప్రాచీన రాక్-కట్ టెంపుల్‌తో పాటు ఒక దర్గా కూడా ఉంది. ఈ వివాదం కేవలం దీపారాధన స్థలానికి సంబంధించినది కాదని.. ఇది ఆలయ సంప్రదాయాలపై కోర్టులు ఎలా తీర్పులు ఇస్తాయన్నది డీఎంకే ప్రశ్నిస్తున్నమాట. ఈ వివాదం ఎలా చూసినా.. తమిళనాడులో రాజకీయం అయిపోయింది. ఎలా స్పందిస్తే ఏం అవుతుందో అని విజయ్ లాంటి పార్టీలు ఇంకా స్పందించలేదు. డీఎంకే హిందూత్వానికి వ్యతిరేకమని బీజేపీ ప్లాన్డ్ గా ప్రచారం చేస్తోంది. ఈ రాజకీయం ఏ మలుపులు తిరుగుతుందో కానీ ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో.. అధికార పార్టీకి మాత్రం.. ఈ వివాదం పెను ఇబ్బందులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
