ట్యాపింగ్ కేసులో ఏ వన్ నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును అమెరికా నుంచి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు దాదాపుగా ఫైనల్ కు చేరుకున్నాయి. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. శ్రవణ్ రావులా అరెస్టు చేయకుండా చాన్స్ ఇస్తే ఇండియాకు వచ్చి విచారణకు సహకరించాలని ఆయన అనుకున్నారు. కానీ అలాంటి అవకాశం దొరకలేదు.
ప్రభుత్వం మారగానే చికిత్స పేరుతో ఆయన అమెరికా వెళ్లిపోయారు. ట్యాపింగ్ గురించి బయటపడిన తర్వాత మొదట్లో పోలీసులకు టచ్ లోకి వచ్చి ఆరు నెలల్లో వస్తానని మభ్య పెట్టారు. ఓ దశలో ఆయన బదలుదేరారని దుబాయ్ లో దిగిపోయి మళ్లీ వెనక్కి వెళ్లారన్న ప్రచారం జరిగింది. ఈ కేసులో ఏం జరుగుతుందో కానీ ఆయన పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి గ్రీన్ కార్డు కూడా పొందారని అంటున్నారు.
అయితే ఆయన పాస్ పోర్టును రద్దు చేయడంతో పాటు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడంతో అక్కడి అధికారులు తిప్పి పంపడం ఖాయంగా కనిపిస్తోంది. న్యాయ పోరాటం చేస్తున్నానని చెప్పి ఆయన కొంత చాన్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఆయనను పంపించేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకేమైనా మార్గాలున్నాయేమో తెలియదు కానీ.. ఇప్పటికి ఆయన రావడం ఖాయమయింది. రాగానే అరెస్టు చేస్తారు. తర్వాత రాజకీయ మలుపులు ఉండనున్నాయి.