హోటల్ రంగంలో దశాబ్దాల పాటు కొనసాగిన ఒక చారిత్రాత్మక భాగస్వామ్యానికి తెరపడింది. జీవీకే గ్రూప్‌కు చెందిన జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ నుంచి టాటా గ్రూప్‌కు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ పూర్తిగా తప్పుకుంది. జీవీ కృష్ణారెడ్డికి చెందిన జీవీకే గ్రూపుతో కలిసి టాటాలకు చెందిన ఇండియన్ హోటల్స్ లిమిటెడ్ దశాబ్దాలుగా ఆతిధ్య రంగంలో వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి.
హైదరాబాద్ తొలి తరం స్టార్ హోటళ్లు తాజ్ డెక్కన్, తాజ్ కృష్ణా వంటి హోటళ్లు టాటా గ్రూప్, జీవీకే గ్రూప్ భాగస్వామ్యంతో ఏర్పాటయ్యాయి. జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్‌లో టాటా గ్రూప్‌నకు ఉన్న సుమారు 49 శాతం వాటాను జీవీకే గ్రూప్ ప్రమోటర్లు కొనుగోలు చేశారు. దీంతో ఈ హోటళ్లపై టాటా గ్రూప్‌నకు ఉన్న యాజమాన్య హక్కులు ముగిసిపోయాయి. జీవీకే గ్రూప్ పూర్తి స్థాయి నియంత్రణను సొంతం చేసుకుంది.
హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక హోటళ్లు అయిన తాజ్ కృష్ణా , తాజ్ డెక్కన్ , తాజ్ బంజారా, చండీగఢ్‌లోని తాజ్ చండీగఢ్ వంటి హోటళ్లు ఈ భాగస్వామ్యంలో భాగంగా ఉన్నాయి. తాజా ఒప్పందం ప్రకారం, ఈ హోటళ్లలో టాటా గ్రూప్ వాటాలు వదులుకున్నప్పటికీ నిర్వహణ ఒప్పందం కింద కొంత కాలం తాజ్ బ్రాండ్ పేరుతోనే కొనసాగే అవకాశం ఉంది. టాటా గ్రూపు భాగస్వామ్య సంస్థల్లో తన పెట్టుబడులను వెనక్కి తీసుకుని, దేశవ్యాప్తంగా సొంత బ్రాండ్లను స్వతంత్రంగా విస్తరించాలని భావిస్తోంది.
