విశాఖకు ప్రకటించిన పెట్టుబడులు ఒకటొకటిగా ఆచరణలోకి వస్తున్నాయి. టీసీఎస్ కంపెనీకి భూమి కేటాయించినప్పటికీ..శాశ్వతభవనాల నిర్మాణం కొనసాగుతున్న సమయంలోనే.. కార్యకలాపాలు నిర్వహించేందుకు మిలీనియం టవర్స్ ను అద్దెకు తీసుకుంది. 2014-19 మధ్య కాలంలో ఐటీని ప్రోత్సహించడానికి మిలీనియం టవర్స్ ను చంద్రబాబు ప్రభుత్వం నిర్మించింది. కొన్ని ఐటీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాయి. అయితే జగన్ దాన్ని సచివాలయంగా మార్చాలన్న ఉద్దేశంతో ఐటీ కంపెనీలను తరిమేశారు. దాంతో అది ఖాళీ అయిపోయింది.
చంద్రబాబు మరోసారి సీఎం అయ్యాక టీసీఎస్‌తో సంప్రదింపులు జరిపారు. విశాఖలో క్యాంపస్ పెట్టేందుకు వారు అంగీకరించారు. ఉన్న పళంగా క్యాంపస్ పెట్టేందుకు భవనం చూపిస్తామని చెప్పడంతో దానికీ అంగీకరించారు. అందులో భాగంగా మిలీనియం టవర్స్ ను కేటాయించారు. మరో వైపు శాశ్వత భవనాల నిర్మాణం కోసం భూమిని కేటాయించారు. వాటిలో త్వరలో భూమిపూజ చేసి నిర్మాణాలు ప్రారంభించే అవకాశం ఉంది. విశాఖలో దాదాపుగా పది వేల మందికి ఉద్యోగాలివ్వాలని టీసీఎస్ నిర్ణయించుకుంది.
టీసీఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఒకటి. ఆరున్నర లక్షల మంది ఉద్యోగులు ఆ కంపెనీలో ఉన్నారు. విశాఖలో పూర్తి స్థాయి క్యాంపస్ ఏర్పాటు చేయాలనుకున్న తర్వాత పలు కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. పలు ఎమ్మెన్సీ కంపెనీలు తమ ప్రణాళికలను ప్రకటించాయి. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ను నిర్మించడం మరో ఆకర్షణ. మొత్తంగా వైజాగ్ దశ మారుతోంది.