భారత రాజకీయ చరిత్ర ఒక ప్రాంతీయ పార్టీ నాలుగు దశాబ్దాలకు పైగా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో నిలబడటం సామాన్యమైన విషయం కాదు. 1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నాటిన ఈ మొక్క, నేడు మహావృక్షమై కోట్లాది మంది తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. టీడీపీ ప్రయాణం కేవలం ఒక పార్టీ ప్రస్థానం మాత్రమే కాదు, అది ఒక వ్యవస్థగా ఎలా రూపాంతరం చెందింది .
అజేయమైన కార్యకర్తల సైన్యం
టీడీపీకి ఉన్న అసలైన బలం దాని కార్యకర్తలే. కార్యకర్తలే పార్టీకి ప్రాణం అని నమ్మే నాయకత్వం ఉండటం ఈ పార్టీకి ఉన్న అతిపెద్ద బలం. ఏ పార్టీకైనా అధికారం ఉన్నప్పుడు జై కొట్టేవారు వేలల్లో ఉంటారు, కానీ అధికారం లేనప్పుడు, కఠిన సవాళ్లు ఎదురైనప్పుడు కూడా జెండాను భుజాన వేసుకుని నడిచే సైనికులు ఉండటం టీడీపీ ప్రత్యేకత. 2019 నుంచి 2024 వరకు పార్టీ ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులు, అక్రమ కేసులు, వేధింపులను తట్టుకుని కేడర్ నిలబడటమే ఆ పార్టీ పునర్వైభవానికి పునాది వేసింది. ఇటీవల ప్రవేశపెట్టిన టీడీపీ 3.0 వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా గ్రౌండ్ లెవల్ కార్యకర్తలకు నేరుగా గుర్తింపునివ్వడం పార్టీని మరింత బలోపేతం చేస్తోంది.
నాయకత్వ మార్పు – తదుపరి తరం సిద్ధం
చాలా ప్రాంతీయ పార్టీలు వ్యవస్థాపక నాయకుడి తర్వాత కనుమరుగైపోతుంటాయి. కానీ, టీడీపీలో ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీని సాంకేతికతతో జోడించి ఆధునికీకరించారు. ఇప్పుడు అదే పరంపరలో నారా లోకేష్ ట్రాక్ ‘లోకి రావడం పార్టీకి కొత్త ఊపిరి పోసింది. ముఖ్యంగా యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ తనలోని నాయకత్వ పటిమను నిరూపించుకోవడమే కాకుండా, సామాన్య ప్రజలకు చేరువయ్యారు. చంద్రబాబు అనుభవం, లోకేష్ ఆధునిక ఆలోచనా దృక్పథం కలిసి టీడీపీని రాబోయే దశాబ్దాల కాలానికి సిద్ధం చేస్తున్నాయి. ఒక ప్రత్యామ్నాయ నాయకత్వం స్పష్టంగా కనిపించడం పార్టీ భవిష్యత్తుపై కార్యకర్తల్లో భరోసాను నింపుతోంది.
జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర
ప్రాంతీయ పార్టీల మనుగడకు జాతీయ పార్టీలతో వ్యవహరించే తీరు చాలా కీలకం. దేశంలో ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే, కేంద్రంలోని జాతీయ పార్టీలతో ఎప్పుడు సఖ్యతగా ఉండాలి, ఎప్పుడు పోరాడాలి అనే విషయంలో టీడీపీ గత 44 ఏళ్లుగా ఎంతో పరిణితిని ప్రదర్శించింది. కింగ్ మేకర్ పాత్ర పోషించినా, ప్రతిపక్షంలో కూర్చున్నా తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేయడం ఆ పార్టీ నైజం. జాతీయ పార్టీల కుట్రలను ఛేదిస్తూ, ప్రాంతీయ ప్రయోజనాల కోసం రాజీపడని పోరాటం చేయడం వల్లే టీడీపీ ఇప్పటికీ జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా నిలబడింది.
సవాళ్లు – భవిష్యత్ లక్ష్యాలు
గడిచిన కాలం ఎంత వైభవోపేతంగా ఉన్నా, రాబోయే కాలం సవాళ్లతో కూడుకున్నది. మారుతున్న టెక్నాలజీ, మారుతున్న ఓటర్ల ఆలోచనా విధానం, సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాలను తట్టుకుని నిలబడాలి. ముఖ్యంగా యువతను ఆకట్టుకోవడంలో కొత్త వ్యూహాలను అనుసరించాలి. భవిష్యత్ నాయకత్వం ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లినందున., సంక్షేమం అభివృద్ధిని సమన్వయం చేస్తూ ముందుకు సాగడమే టీడీపీ ముందున్న ప్రధాన లక్ష్యం. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా పేరున్న ఈ పార్టీ, రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో మరింత క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంది.
44వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ వేదిక మాత్రమే కాదు, అది తెలుగు జాతి ఆశలు, ఆకాంక్షల ప్రతిరూపం. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఫీనిక్స్ పక్షిలా లేవడం ఈ పార్టీ డీఎన్ఏలోనే ఉంది. అదే స్ఫూర్తితో నిరంతరం ప్రజల కోసం పని చేస్తూ, తదుపరి తరం నాయకత్వంతో సరికొత్త చరిత్ర సృష్టించడానికి సన్నద్ధమవుతోంది.
