నారమల్లి పద్మజ అనే చిత్తూరుజిల్లాకు చెందిన వైసీపీ నేతను జగన్ రెడ్డి హయాంలో లెక్కలేనంత మంది సలహాదారుల్లో ఒకరిగా నియమించారు. ఈ నియామకం ఎందుకంటే ఆర్థికంగా భరోసా కల్పించడానికి. 2023లో నియమించారు. ప్రభుత్వం ఊడిపోయేదాకా ఆమెకు రూపాయి జీతం చెల్లించలేదు. జగన్ రెడ్డి రెండు విధాలుగా మోసం చేశారని ఆమె బాధపడి ఉంటారు. కానీ ఇప్పుడు ఏడాదిన్నర తర్వాత ఆమెకు అప్పటి జీతాలు చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నారమల్లి పద్మజ సలహాదారుగా ఉండి..ఏం చేశారంటే.. వైసీపీ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు కుటుంబంలోని మహిళలపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేవారు. ఆ వీడియోలన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో కాంగ్రెస్ లో ఉన్న ఆమెను వైసీపీలోకి తీసుకుని టిక్కెట్ ఆశ పెట్టారు. కుదరక సలహాదారు పదవి ఇచ్చారు. అయితే ఇప్పుడు ఎందుకు జీతాలు చెల్లిస్తున్నారన్నది సస్పెన్స్. జగన్ సలహాదారుగా నియమించి జీతాలు ఎగ్గొట్టిపోయారు. కానీ ఈ ప్రభుత్వం చెల్లిస్తోంది.
నారమల్లి పద్మజ ఇప్పుడు కూడా వైసీపీకి పని చేస్తున్నారో లేదో స్పష్టతలేదు. ఇటీవలి కాలంలో మీడియా సమావేశాల్లో పాల్గొనడం లేదు. బహుశా ఆమె తనకు సలహాదారుగా రావాల్సిన జీతాలను వసూలు చేసుకోవడానికి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారేమో తెలియదు కానీ.. మొత్తంగా ఆమెకు జీతాలు వచ్చేస్తున్నాయి. అవి బ్యాంకులో పడిన తర్వాత మళ్లీ వైసీపీ ఆఫీసులో పాత లాంగ్వేజ్ లో తన పని ప్రారంభిస్తారేమో చూడాల్సి ఉంది.

