తెదేపా సెల్ఫ్ గోల్ చేసుకొందా?

ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలు వేర్పడినప్పటికీ వాటి రాజకీయాలు మాత్రం నేటికీ వేర్పడటం లేదు. వేర్పడే అవకాశం కూడా లేదు. ఒక రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలు మరొక రాష్ట్రంపై ప్రభావం చూపుతూనే ఉన్నాయి. తెరాసలో చేరిన 12 మంది తెదేపా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ తెలంగాణా తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆంధ్రాలో తెదేపాకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడటమే అందుకు చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

తెరాసలో చేరిన 12 మంది తెదేపా ఎమ్మెల్యేలపై మూడు నెలలోగా స్పీకర్ ని తగిన నిర్ణయం తీసుకోమని హైకోర్టు ఆదేశించింది. అందుకు రేవంత్ రెడ్డితో సహా తెలంగాణా తెదేపా నేతలు చాలా సంతోషపడుతున్నారు. అది తమ విజయంగానే భావిస్తున్నారు. “హైకోర్టు తీర్పు ముఖ్యమంత్రి కెసిఆర్ కి అది చెంపదెబ్బ వంటిది” అని రేవంత్ రెడ్డి అన్నారు.

ఆ తీర్పుకి తెలంగాణా తెదేపా నేతలు సంతోషపడటం సహజమే. కానీ అది ఆంధ్రాలో తెదేపా నేతలకి చాలా ఇబ్బందికరంగా మారింది. దానిపై ఎవరూ నోరు విప్పలేని పరిస్థితి. ఎందుకంటే తెలంగాణాలో కెసిఆర్ సర్కార్ ఏ తప్పు చేసిందో, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు సర్కార్ కూడా అదే తప్పు చేసింది కనుక.

హైకోర్టు తీర్పు పట్ల వైకాపా నేత అంబటి రాంబాబు హర్షం వ్యక్తం చేస్తూ “ఈ తీర్పు తెలంగాణా తెదేపా ఎమ్మెల్యేలకి, ఆ రాష్ట్ర స్పీకర్ కి మాత్రమే కాక ఏపి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకి, తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలకి కూడా వర్తిస్తుందని మేము భావిస్తున్నాము. ఇక్కడ కూడా స్పీకర్ అదే విధంగా వ్యవహరిస్తున్నారు. తెదేపాలో చేరిన మా పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మేము చేసిన విజ్ఞప్తికి ఆయన స్పందించడంలేదు. హైకోర్టు తీర్పుని చూసిన తరువాతైన ఆయన వారిపై చర్యలు తీసుకొంటారని ఆశిస్తున్నాము. ఒకవేళ తీసుకోకుంటే మేము కూడా హైకోర్టుకి వెళతాము,” అని హెచ్చరించారు.
ప్రతిపక్ష పార్టీలు హైకోర్టుకి వెళ్ళడం, వారి పిటిషన్లపై హైకోర్టు సానుకూలంగా స్పందించడం బాగానే ఉంది కానీ స్పీకర్ పరిధిలో ఉన్న ఆ వ్యవహారాలపై హైకోర్టులు కూడా కలుగజేసుకోలేవు కనుక ఈ రాజకీయ పరిణామాలన్నీ ఒకరినొకరు విమర్శించుకోవడానికి మాత్రమే ఉపయోగపడవచ్చు. ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయడంతో తెదేపా సెల్ఫ్ గోల్ చేసుకొన్నట్లు చెప్పవచ్చు. కనుక ఇకపై రెండు రాష్ట్రాలలో రాజకీయాలని దృష్టిలో పెట్టుకొనే రాజకీయ పార్టీలు అడుగు ముందుకు వేయవలసిన అవసరం ఉందని ఈ తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com