తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేల వ్యవహారశైలి ఆ పార్టీ హైకమాండ్ కు చిక్కులు తెచ్చి పెడుతోంది. ఒకరి తర్వాత ఒకరు గీత దాటుతూనే ఉన్నారు. ఓ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలన్నదానిపై వారు కనీస అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయడం లేదు. అధికారం చేతికి వచ్చిందన్న అహంకారంతో పాటు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు సైలెంటుగా ఉంటూండటంతో తమకు ఎదురు లేదని వారు రెచ్చిపోతున్నారు. దాదాపుగా పదిహేను మంది ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకున్నారు. వారందరికీ గట్టి వార్నింగులు ఇచ్చారు.
గీత దాటుతున్న మొదటి సారి ఎమ్మెల్యేలు
సీనియర్ ఎమ్మెల్యేలకు రాజకీయంపై కాస్త అవగాహన ఉంది. గెలవకముందు ఎలా ఉన్నా.. గెలిచిన తర్వాత మాత్రం ప్రజల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వారికి క్లారిటీ ఉంది. అలాగే నియోజకవర్గానికి తానే రాజు అన్నట్లుగా వ్యవహరించకుండా.. ప్రజా జీవితాల్లో చొరబడకుండా…. ఎంత వరకు రాజకీయం చేయాలో అంత వరకే రాజకీయం చేస్తున్నారు. వారి విషయంలో అంతా స్మూత్ గా జరిగిపోతున్నా… వివిధ కారణాలతో మొదటి సారి అవకాశం దక్కించుకున్న వారు.. గాలిలో గెలిచేశారు. అలా గెలిచినవారికి అధికారం నెత్తికెక్కుతోంది.
అధికారం కొత్త – జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి !
ఫోన్లలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం రాజకీయ నేతలకు చేటు చేస్తుంది. అనంతపురం ఎమ్మల్యే మద్యం మత్తులో ఏదో వాగాడు. దాన్ని అవతల వాళ్లు వ్యూహాత్మకంగా రికార్డు చేశారు. ఆ ఎమ్మెల్యే మద్యం మత్తులో ఉన్నప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని సొంత పార్టీ నేతలు అంటూంటారు. ఆయన తరహాలోనే పలువురు ఎమ్మెల్యేలు తాము చేస్తున్న పనులపై నియంత్రణ కోల్పోతున్నారు. పార్టీకి చెడ్డపేరు తీసుకువస్తున్నారు. వీరిలో కొంత మంది అవినీతికి పాల్పడుతూంటే.. మరికొంత మంది వ్యక్తిగత వ్యవహారాలతో చెడ్డపేరు తెచ్చుకుంటున్నారు.
మారకపోతే ఫస్ట్ టైమే .. లాస్ట్ టైమ్ !
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి ఒక్కరికి ఒకటి, రెండు అవకాశాలు ఇస్తారు. దిద్దుకోగలిగిన తప్పులు చేసినప్పుడు దిద్దుకునే అవకాశం ఇస్తారు, హెచ్చరికలు చేసినంత కాలం చేస్తారు. మార్పు లేదంటే ఆయన వదిలేస్తారు. ఇక పట్టించుకోరు. తర్వాత ఎంత ఒత్తిడి చేసినా.. వారికి మరో అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు ఏ మాత్రం ఆసక్తి చూపించరు. అప్పటికీ కాని అలాంటి వారికి ఏం జరిగిందో అర్థం కాదు. తొలి సారితోనే రాజకీయ భవిష్యత్ అంతమైపోతుంది.