ముద్రగడపై కావాలనే అతిగా దాడి

కాపునాయకుడు ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్ల వాగ్దానం అమలుకై ఆందోళన కార్యక్రమం ప్రకటించిన ప్రతిసారి ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తున్నది. ముందే మంత్రులూ తెలుగుదేశం నేతలు ఆయనపై విరుచుకుపడటం పరిపాటిగా మారింది. నిరాహారదీక్ష సందర్భంలో ఆయన ఇంటి దగ్గర పోలీసుల చొరబాటు, తర్వాత ఆయన వున్న ఆస్పత్రి దగ్గర విపరీత భద్రత వంటివి కూడా విమర్శకు గురైనాయి. ఇప్పుడు ఆయన చలో అమరావతి అంటుంటే మళ్లీ అదే విమర్శల పర్వం మొదలైంది. హౌంమంత్రి చినరాజప్ప వంటివారు రంగంలోకి దిగారు. నిజంగా ముద్రగడ చేసే ఆందోళన వల్ల అంత ప్రభావం వుంటుందా? అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం వుందా అనే దానిపై అనేక రకాల వాదనలు వున్నాయి. మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తనదైన శైలిలో దీనిపై విశ్లేషణ చేశారు. వ్యూహాలలో దిట్ట అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే ముద్రగడ విషయంలో శ్రుతిమించి దాడి చేస్తున్నారనేది ఉండవల్లి వ్యాఖ్యానం. ముద్రడగపట్ల కఠినంగా వ్యవహరించడం ద్వారా ఆయనను వ్యతిరేకించే వారిని పూర్తిగా తనవైపు తిప్పుకోవచ్చన్న అంచనాతోనే చంద్రబాబు ఇలా చేస్తున్నారేమోనని ఒక ఇంటర్వ్యూలో సందేహం వెలిబుచ్చారు. ‘లేకుంటే అక్కడ అంత లేదు.. కాని తానేదో గొప్పగా అణచేశాననిపించుకోవడానికే ఇంత హడావుడి చేస్తున్నారేమో” అన్నారాయన. అయితే వీటివల్ల కాపులలో టిడిపి ప్రభుత్వంపై విముఖత పెరుగుతున్నదని కూడా చెప్పారు. గతంలో తూర్పు గోదావరి జిల్లాలో పవన్‌ కళ్యాణ్‌ కారణంగా భారీ ఎత్తున టిడిపికి పడిన వారి ఓట్లు ఇప్పుడు రాకపోవచ్చని జోస్యం చెప్పారు. ఏది ఏమైనా ప్రభుత్వం అతిగా స్పందిస్తున్న మాట మాత్రం నిజమేనన్న భావన చాలామందిలో ఏర్పడుతున్నది. దీనివల్ల అవతలివారి ఓట్లు వస్తాయే లేదో గాని వీరి ఓట్లు మాత్రం పోవడం ఖాయమవచ్చు కదా…

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.