జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సభ్యత్వాల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. సభ్యత్వాలను పవన్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. అయితే అధికార కూటమిలో భాగంగా ఉన్నపార్టీగా ఊహించనంత భారీగా సభ్యత్వాలు చేయలేకపోయారన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీనికి కారణం సభ్యత్వ రుసుమే. సాధారణంగా రాజకీయ పార్టీలు రూ. వంద సభ్యత్వ రుసుం పెడతాయి. ఈ రుసుంను కూడా రాజకీయ పార్టీలు కార్యకర్తల నుంచి వసూలు చేయవు. వారి తరపునపార్టీ నేతలే కడతారు. తమ బలాన్ని నిరూపించకోవడానికి ద్వితీయ శ్రేణి నేతలు సభ్యత్వాలను చేయిస్తారు. జనసేనకూ అలాంటి పరిస్థితి తప్పలేదు. అయితే జనసేన ద్వితీయ శ్రేణి నేతలు.. పార్టీ కార్యకర్తల సభ్యత్వాలకు చెల్లించాలనుకున్నా.. ఒక్కో సభ్యత్వం నాలుగు వందలు కావడంతో.. ఆర్థికంగా బలంగా లేని నేతలు వెనకబడిపోయారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఉద్యమి సభ్యత్వాల జోరు
జనసేన పార్టీ 2026 సభ్యత్వ నమోదు కార్యక్రమం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ ఆవిర్భవించినప్పుడు కేవలం 150 మందితో ప్రారంభమై, నేడు సుమారు 13 లక్షల మంది సభ్యుల స్థాయికి చేరిన ప్రయాణం అద్భుతమే అయినప్పటికీ, తాజా నమోదు ప్రక్రియలో వినిపిస్తున్న కొన్ని అభిప్రాయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా రుసుము పెంచడం వల్ల సభ్యత్వాల సంఖ్య ఆశించినంత వేగంగా పెరగలేదన్న వాదన వినిపిస్తోంది.సభ్యత్వ రుసుమును రూ. 400 గా నిర్ణయించడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉంది. కేవలం రికార్డుల కోసం వచ్చే సభ్యుల కంటే, పార్టీ సిద్ధాంతాలను నమ్మి, దానికి అండగా నిలబడే క్రియాశీల కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అని ఆయన భావిస్తున్నారు.
ద్వితీయ శ్రేణి నేతలకు ఆర్థిక భారం
రాజకీయ పార్టీలు తమ బలాన్ని నిరూపించుకోవడానికి సభ్యత్వాలను ఆయుధంగా వాడుకుంటాయి. అయితే, జనసేన నిర్ణయించిన రూ. 400 రుసుము ద్వితీయ శ్రేణి నేతలకు భారంగా మారింది. తమ పట్టును నిరూపించుకోవాలని తపించే నేతలు, కార్యకర్తల కోసం తామే రుసుము చెల్లించాలనుకున్నా ఆర్థిక ఇబ్బందులు అడ్డొచ్చాయి. ఒక్కో సభ్యత్వం రూ. 400 కావడంతో, వందల సంఖ్యలో సభ్యత్వాలు చేయించాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న జనసేన కింది స్థాయి నేతలు ఈ భారాన్ని భరించలేక వెనకబడిపోయారు. ఇదే క్రమంలో నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు కొందరు జనసేన ద్వితీయ శ్రేణి నేతలకు ఆర్థికంగా సహకరించారనే ప్రచారం జోరందుకుంది. ఇది కూటమి ఐక్యతను చాటుతున్నప్పటికీ, జనసేన సొంత కేడర్‌లో మాత్రం కొంత చర్చకు కారణమైంది.
సంఖ్య పవన్ కల్యాణ్‌కు ప్రధానం కాదు !
పార్టీ కోసం నిలబడే ఒక నిజమైన సైనికుడు వందల మంది సభ్యులతో సమానం. 2026 లోకల్ బాడీ ఎన్నికలకు ముందే బలమైన కేడర్‌ను సిద్ధం చేయడమే లక్ష్యంగా పార్టీ ఉద్యమి , సాధక్ వంటి విభాగాలను ప్రవేశపెట్టింది. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టి, పార్టీకి నిజమైన మద్దతుదారులను గుర్తించడమే ఈ ప్రక్రియ అసలు ఉద్దేశం. ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉండి కూడా సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఇంత పెద్ద మొత్తంలో సభ్యత్వ రుసుము నిర్ణయించడం సాహసోపేతమైన అడుగే అనుకోవచ్చు.


