ప్రొ.నాగేశ్వర్: టీడీపీ కొత్త పొత్తులకై చూస్తోందా..?

తెలుగుదేశం పార్టీ మహానాడులో అన్ని పార్టీలనూ వ్యతిరేకించారు. బీజేపీ, కాంగ్రెస్, వైసీపీ, జనసేనలపై తీవ్రమైన విమర్శలు చేశారు. కానీ వామపక్షాలను మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. నిజానికి వామపక్షాలు చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ.. ఉద్యమాలు చేస్తూ ఉంటాయి. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేన మద్దతుతో గట్టెక్కారు. ఇప్పుడు బీజేపీ, జనసేన రెండూ మైనస్ అయ్యాయి. ఎంతో కొంత అధికార వ్యతిరేకత కూడా ఉండే ఉంటుంది. ఎలా లేదన్నా.. తెలుగుదేశం పార్టీకి మైనస్ ఓటింగ్ టెన్షన్ ఉంటుంది. ఈ మైనస్ ఓటింగ్‌ను ఎంతో కొంత కవర్ చేసుకునేలా.. వామపక్షాల వైపు తెలుగుదేశం పార్టీ చూసే అవకాశం ఉంది.

వామపక్షాలకు భారీ స్థాయిలో ఓటింగ్ ఉండకపోవచ్చు.. కానీ రెండు, మూడు శాతం ఓట్లు అయితే ఉంటాయి. మిగతా పార్టీలతో పొత్తు పెట్టుకుంటే… ఓటు ట్రాన్స్‌ఫర్ అవుతుందో లేదో కానీ… వామపక్షాల ఓట్లు మాత్రం కచ్చితంగా పడతాయి. ఎందుకంటే.. వామపక్షాలకు కొంత కమిటెడ్ ఓటర్లు ఉంటారు. వారు పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో… తెలుగుదేశం పార్టీ పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తోంది. వామపక్షాలు కూడా.. మళ్లీ బీజేపీని అధికారంలోకి రానీయకూడదన్న లక్ష్యంతో ఉన్నాయి. అయితే ఈ రెండు పక్షాలు ఈ దిశగా ఆలోచిస్తున్నాయని చెప్పలేం. కానీ.. టీడీపీ దృష్టిలో ఇలాంటి ఆలోచన ఉండబట్టే.. లెఫ్ట్‌ను అసలు మహానాడులో విమర్శించలేదని అనుకోవచ్చు. ఏపీలో ఒక వేళ లెఫ్ట్ తో ఉంటే.. తెలంగాణలో పొత్తు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి అవకాశం , అవసరం ఉంటే… పొత్తు దిశగా ఆలోచన చేసే అవకాశం ఉంది. సీపీఐలోని ఓ వర్గం.. బీజేపీని ఓడించేవారిని కలుపుకుని వెళ్లాలనే ఆలోచనలో ఉంది.

లెఫ్ట్ పార్టీలు..ఏపీలో మొదట జనసేనకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. జనసేన కలసిరాకపోతే.. ఆ తర్వతా తెలుగుదేశం పార్టీ వైపు దృష్టి సారించే అవకాశం ఉంది. ఏపీలో ప్రస్తుతం బైపొలార్ పాలిటిక్స్ ఉన్నాయి. టీడీపీ-వైసీపీ మాత్రమే సీన్ లో ఉన్నాయి. దీని వల్ల ఓటింగ్ మొత్తం టీడీపీనా..? వైసీపీనా..? అన్నట్లుగా జరుగుతోంది. దీని వల్ల చిన్న పార్టీలు దెబ్బతింటున్నాయి. ఈ బైపొలార్ పొలిటిక్స్‌ను బ్రేక్ చేస్తే తప్ప… లెఫ్ట్ పార్టీలు నిలబడలేవు. జనసేన ద్వారా ఆ బైపొలార్ పాలిటిక్స్‌ను బ్రేక్ చే తేవాలని లెఫ్ట్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అందువల్ల జనసేనను… లెఫ్ట్ పార్టీలు మొదటి ఆప్షన్ గా ఉంచుకున్నాయి.

అయితే పవన్ కల్యాణ్ ఇటీవలి కాలంలో… మొత్తం అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. పోరాటాల్లో , ఉద్యమాల్లో… జనసేనతో కలిసి పనిచేస్తున్నప్పటికీ.. ఎన్నికల సమయంలో కలసి పోటీ చేసేందుకు పవన్ కలసి వస్తారో లేదో చెప్పలేము. ఇక జగన్మోహన్ రెడ్డి.. బీజేపీపై పూర్తి వ్యతిరేకత విధానాన్ని తీసుకోవడం లేదు. అందుకే వైసీపీని అసలు లెఫ్ట్ పార్టీలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. అందుకే..సీపీఐ పార్టీలోని ఓ వర్గం… జనసేన కలసి రాకపోతే.. టీడీపీతోనే వెళదామని వాదిస్తున్నాయి.

ఇక సీపీఎంలో భిన్నమైన వాదన వినిపిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల… నష్టం జరిగిందని.. ఆ పార్టీ భావిస్తోంది. తాము ఎలాగూ అధికారంలోకి రాలేము. అలాగని.. వేరే పార్టీలు అధికారంలోకి రావడానికి తామెందుకు నిచ్చెనలా ఉపయోగపడాలని సీపీఎం భావిస్తోంది. ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు సీపీఎం వ్యతిరేకం కాదు కానీ… తమకు ఏమైనా రాజకీయంగా లాభం కలిగితేనే పొత్తుల దిశగా ఆలోచించే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఇంకా ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదు. లాభనష్టాలు బేరీజు వేసుకుంటే టీడీపీ వామపక్షాలకు స్నేహహస్తం చాచే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.