తెలుగుదేశం పార్టీ తమ పార్టీ ఎమ్మెల్యేలను దారిలో పెట్టి ప్రజలకు దగ్గరయ్యేలా చేయడానికి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. కొత్త ఎమ్మెల్యేలు మిడిమాలంగా వ్యవహరిస్తూ తాము నష్టపోవడమే కాకుండా.. పార్టీకి కూడా నష్టం చేస్తున్నారని పార్టీ అధినేత ఆగ్రహంతో ఉన్నారు. వారి బాధ్యతల్ని ఇంచార్జ్ మంత్రులకు ఇస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు..ఎమ్మెల్యేలకు ప్రతి నెలా చేయాల్సిన షెడ్యూల్ ను ఖరారు చేసి పంపించారు. ఆ షెడ్యూల్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫాలో కావాలని లేకపోతే ఇక చెప్పాల్సిన అవసరం కూడా ఉండదని సంకేతాలు పంపారు.
ప్రతి ఐదురోజులకు ఒక రోజు ప్రజల మధ్య
ఎమ్మెల్యేలకు వారంలో ఒక రోజు ప్రత్యేకమైన కార్యక్రమం దిశానిర్దేశం చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీన సామాజిక పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొని తీరాల్సిందేనని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. వృద్ధాప్య, వితంతు వంటి పించన్లు తీసుకునేవారికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. పించన్లు పెంచి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒకటో తేదీన ఇస్తోంది. లబ్దిదారులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. వారి అభిమానాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఎమ్మెల్యేలు పెన్షన్ల పంపిణీలో పాల్గొనాలని దిశానిర్దేశ చేశారు. అలాగే ఐదో తేదీన ప్రభుత్వ స్కూళ్లను సందర్శించడం, పదో తేదీన అన్నక్యాంటీన్ల వద్ద భోజనం చేసి .. అక్కడ ఆకలి తీర్చుకున్నవారితో మాట్లాడటం, పదిహేనే తోదీన ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించడం, ఇరవయ్యే తేదీన సీఆర్ఆర్ఎఫ్, టీడీపీ బీమా చెక్కులను కార్యకర్తలకు పంపిణీ చేయడం, ఇరవై ఐదో తేదీన ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళ్లి ప్రజల్ని పలకరించి సమస్యలపై ఆరా తీయడం వంటివి షెడ్యూల్ చేశారు.
ఎమ్మెల్యేలు నేలకు దిగాల్సిందే !
తొలి సారిగా గెలిచిన ఎమ్మెల్యేలే కాకుండా కొంత మంది సీనియర్లు కూడా.. తాము అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఏమిటని అనుకుంటారు. తమ రేంజ్ ఏంటి.. తాము ఏంటి అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వారందర్నీ నేలకు దించే ట్రీట్ మెంట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలు ఓట్లు వేయకపోతే అసలు ఎగరడానికి అవకాశం కూడా ఉండేది కాదని గుర్తు చేస్తున్నారు. ఇతర వ్యవహారాలతో తీరిక లేకుండా ఉండే వారికి స్పష్టమైన హెచ్చరికల్ని ఇప్పటికే పంపించారు. వారందరికీ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఎంత మంది .. ప్రజల కోసం సమయం కేటాయిస్తారో.. వారికే చంద్ర బాబు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పట్టించుకోని వారిని పట్టించుకోవడం మానేస్తారు.
పాత తప్పులు జరగకుండా చంద్రబాబు కఠిన నిర్ణయాలు
ఎమ్మెల్యేలు తప్పు చేశారని వారికి వ్యతిరేకంగా ఓటేస్తే అది టీడీపీకి వ్యతిరేకంగా వేసినట్లు అవుతుంది..అందుకే తననే అభ్యర్థిగా పరిగణించాలని చంద్రబాబు 2019 ఎన్నికల ప్రచారం ముగించేముందు ప్రజల్ని వేడుకున్నారు. కానీ ప్రజలు .. తాము టీడీపీకి వేసినా అది ఎమ్మెల్యేకే పడుతుందని మళ్లీ ఆ లంపటం ఎందుకని.. వ్యతిరేకంగా ఓటేశారు. ఆ అనుభవం చంద్రబాబుకు ఇంకా గుర్తు ఉంది. వచ్చే ఎన్నికలకు ముందు అలా చెప్పే పరిస్థితి రాకూడదని.. చంద్రబాబు ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే కఠిన చర్యలకూ వెనుకాడే అవకాశాలు కనిపించడం లేదు. మారని ఎమ్మెల్యేలను వదులుకునేందుకు కూడా సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి.


