టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ పార్టీ కార్యకర్తల హత్యలు ఆగడం లేదు. మాచర్ల లాంటి సున్నితమైన నియోజకవర్గంలో మరో రెండు హత్యలు జరిగాయి. ఇక్కడ వైసీపీ నేతలు హత్యలు చేసినట్లుగా కాకుండా టీడీపీ నేతల ఆధిపత్యపోరాటంలో భాగంగానే హత్యలు జరిగాయన్న ప్రచారం జరిగేలా ప్లాన్ చేసుకున్నారు. కొద్ది రోజుల కిందట హంతకులు టీడీపీలో చేరారు. స్థానిక ఎన్నికల్లో తమకు అడ్డు రాకుండా ఉంటారని టీడీపీ కార్యకర్తల్ని చంపేశారు. ఇప్పుడు అది ఆధిపత్య పోరాటం ఖాతాలో పడిపోయింది.
ఖచ్చితంగా ఇదే వ్యూహాన్ని ప్రకాశం జిల్లాలో యువ నేత అయిన వీరయ్య చౌదరి విషయంలోనూ నిందితులు అమలు చేశారు. అక్కడ కూడా నిందితులు టీడీపీ అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరిన వారేనన్న అనుమానాలు ఉన్నాయి. ఇతర చోట్ల జరుగుతున్న నేరాల్లోనూ వారి ప్రమేయంపై ఎక్కువగా ఆరోపణలు వస్తున్నాయి. అంటే వ్యూహాత్మకంగా వైసీపీ నుంచి నేరాలు చేయాలనుకున్న వారు టీడీపీలో చేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా ఇతర పార్టీల క్యాడర్ అధికార పార్టీలోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది. వారికి అవకాశాలు ముఖ్యం. ఈ చేరికలన్నింటిపై హైకమాండ్ లేదా జిల్లా స్థాయి నేతలు దృష్టి పెట్టలేరు. కానీ ఎమ్మెల్యే స్థాయి నేతలు మాత్రం ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి మాచర్లలో గొడవలు లేకుండా ఉండేందుకు.. గ్రామాల్లో వర్గాలను కలిపేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ.. వికటిస్తోంది.
ఇలాంటి దురుద్దేశాలతో పార్టీలో చేరేవారిపై ఇప్పటికైనా ఎమ్మెల్యే స్థాయి నేతలు ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.