ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో తెలుగుదేశం పార్టీలో పెద్దల సభ ముచ్చట మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీలో కూటమికి ఉన్న తిరుగులేని బలం దృష్ట్యా ఈ సీట్లను గెలుచుకోవడం నల్లేరుపై నడకే అయినప్పటికీ.. పార్టీ అంతర్గత వర్గాల్లో మాత్రం ఒక పాత చేదు నిజం, బలమైన సెంటిమెంట్ చర్చకు దారితీస్తోంది. 1984లో ఎన్టీఆర్ కాలం నుంచి నేటి వరకు రాజ్యసభకు వెళ్లిన నేతల చరిత్రను తిరగేస్తే.. పెద్దల సభ సభ్యత్వం టీడీపీకి రాజకీయంగా పెద్దగా కలిసిరాలేదనే అభిప్రాయం క్యాడర్లో గట్టిగా వినిపిస్తోంది.
ఎక్కువ మంది రాజ్యసభ సభ్యులు షాకిచ్చిన వాళ్లే !
టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు దాదాపు 46 మంది నేతలు పార్టీ తరఫున రాజ్యసభలో అడుగుపెట్టారు. అయితే, ఒకసారి కంటే ఎక్కువసార్లు అవకాశం పొందిన అత్యధికులు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు హ్యాండ్ ఇచ్చి వలస బాట పట్టడం నిరంతరం వెంటాడుతున్న సత్యం. నాడు ఎన్టీఆర్ హయాంలో చక్రం తిప్పిన పి. ఉపేంద్ర దగ్గర నుంచి.. నిన్నమొన్నటి సుజనా చౌదరి, సీఎం రమేష్ వరకు ఈ జాబితా చాలా పెద్దదే. ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు కోసం లాఠీ దెబ్బలు తింటూ, జైళ్లకు వెళ్లే క్షేత్రస్థాయి లీడర్లను పక్కన పెట్టి.. కేవలం ఫండింగ్ చేసే కార్పొరేట్ శక్తులకు, పారాచూట్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తాయని చెప్పుకుంటున్నారు. తమ వ్యాపార ప్రయోజనాలు, కాంట్రాక్టులను కాపాడుకోవడానికి వచ్చే ఇలాంటి వారికి పార్టీ సిద్ధాంతాలపై నిబద్ధత ఉండదు కాబట్టే, అధికారం మారగానే ఈజీగా జంప్ అయిపోతారని కార్యకర్తలు నమ్ముతున్నారు.
కార్పొరేట్లకు చాన్సివ్వడం వల్లే !
ఈ రాజ్యసభ వలసల ధోరణి 2019 ఘోర పరాజయం తర్వాత పరాకాష్టకు చేరింది. అప్పట్లో టీడీపీకి ఉన్న ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లో నలుగురు సుజనా చౌదరి, సి.ఎం. రమేష్, టి.జి. వెంకటేష్, గరికపాటి మోహన్ రావు ఒకేసారి గ్రూప్‌గా మారి, రాజ్యసభలో టీడీపీ పక్షాన్ని ఏకంగా బీజేపీలో విలీనం చేసేశారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ లోని లొసుగులను వాడుకుని, మూడింట రెండు వంతుల మెజారిటీతో అనర్హత వేటు పడకుండా సేఫ్‌గా కమలం గూటికి చేరిపోయారు. అంతకుముందు వరకు చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తులుగా, ఢిల్లీలో పార్టీ ముఖచిత్రాలుగా వెలిగిన వీరే.. అధికారం పోగానే పక్కదారి పట్టడం నాడు అధినేత రాజకీయ వ్యూహాల లోపాన్ని ఎత్తిచూపింది.
నారా లోకేష్ ఈ సారి ట్రెండ్ మారుస్తారా?
ప్రస్తుతం కూటమి ఒప్పందంలో భాగంగా జనసేనకు ఒక సీటు కేటాయించగా, మిగిలిన మూడు స్థానాలను టీడీపీ దక్కించుకోనుంది. పాత కార్పొరేట్ ముఖాలతో పాటు కొందరు సిట్టింగ్‌లు మళ్లీ సీట్ల కోసం గట్టిగా లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈసారి నారా లోకేష్ నేతృత్వంలో అభ్యర్థుల వడపోత జరుగుతుండటంతో క్యాడర్ సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెస్తోంది. కేవలం ఆర్థిక అంగబలాన్ని మాత్రమే చూడకుండా.. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న నిబద్ధత గల బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులకు, రాజకీయంగా పార్టీ వాయిస్ వినిపించే వారికే పెద్దల సభకు పంపాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. ఈసారైనా పాత తప్పులను పునరావృతం చేయకుండా నమ్మకమైన లీడర్షిప్ను పంపితేనే.. టీడీపీకి ఈ రాజ్యసభ శాపం వీడుతుందని అనుకోవచ్చు.
