చిరంజీవి 150వ సినిమాకి అనవరమయిన హైప్ సృష్టించుకొని దాని నుంచి బయటపడేందుకు ఆయన ఏవిధంగా తిప్పలు పడుతున్నారో, నారా లోకేష్ ని మంత్రివర్గం తీసుకోబోతున్నట్లు ప్రచారం చేసుకొని, తెదేపా కూడా విమర్శలు ఎదుర్కొని ఇబ్బందులు పడవలసివస్తోంది. “ఇప్పటికే రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తూ అవినీతి ఆర్జనకు అలవాటు పడిన నారా లోకేష్ ని ప్రభుత్వంలోకి తీసుకోవడం వలన ఇప్పుడు ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా వసూళ్లు చేసుకొంటారని” వైకాపా నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. వైకాపా నేతలు చాలా మంది అదేవిధంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
నారా లోకేష్ ని మంత్రివర్గం తీసుకోవాలని చంద్రబాబు నాయుడు భావించినట్లయితే పార్టీలో కానీ, ప్రభుత్వంలో గానీ అందుకు అభ్యంతరాలు చెప్పేవారు, అడ్డుకొనేవారెవరూ ఉండరు. కానీ అవసరం లేకపోయినా నారా లోకేష్ మంత్రివర్గంలోకి తీసుకోవడం అత్యవసరం అన్నట్లుగా తెదేపా నేతలు, మంత్రుల చేత పదేపదే చెప్పించడం వలన దానికి అనవసరమయిన ప్రాధాన్యత (హైప్) ఏర్పడి, అది విమర్శలకు తావిచ్చింది. చంద్రబాబు నాయుడు వారసుడిపై విమర్శలు వస్తే వాటిని త్రిప్పి కొట్టకుండా ఊరుకోవడం సాధ్యం కాదు గాబట్టి సంజాయిషీలు, ప్రతివిమర్శలు కూడా తప్పనిసరయ్యాయి.
వైకాపా నేతలు చేస్తున్న విమర్శలకు తెదేపా తరపున గాలి ముద్దుకృష్ణం నాయుడు జవాబిస్తూ, “నారా లోకేష్ ని మంత్రివర్గంలోకి తీసుకోవడం వారసత్వ రాజకీయాలే అని విమర్శిస్తున్న వైకాపా నేథలకి తమ అధినేత జగన్మోహన్ రెడ్డి వారసత్వ రాజకీయాలు చేయడం కనబడటం లేదా? ఆయన తన తండ్రి హయాంలో ఏమి చేసారో అందరికీ తెలుసు. నారా లోకేష్ ని మంత్రివర్గంలోకి తీసుకోవడం మా పార్టీ అంతర్గత వ్యవహారం. దానితో వైకాపాకి ఏమి సంబంధం? వచ్చే ఎన్నికలలో నారా లోకేష్ పోటీ చేయాలనుకోవడం ఏమయినా నేరమా?” అని ప్రశ్నించారు.