జగన్ ఫెయిల్యూర్‌ను క్యాష్ చేసుకోలేకపోతున్న టీడీపీ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పాలకపక్షం, ప్రధాన ప్రతిపక్షం ఢీ అంటే ఢీ అన్నట్లు ఉన్న సంగతి తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని, ఊపిరి సలపకుండా చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఒక్కోసారి పైచేయి సాధిస్తోందికూడా. గత అసెంబ్లీ సమావేశాలలో ఆద్యంతం ప్రతిపక్షానిదే పైచేయి అని స్పష్టంగా కనబడింది. ఈ విషయంలో జగన్ వ్యూహాన్ని అభినందించక తప్పదు. అయితే ఇప్పుడు జగన్ పక్షంలో ఒక మంచి బలహీనత దొరికినపుడు దానిని అందిపుచ్చుకునే అవకాశాన్ని తెలుగుదేశం నేతలు జారవిడుచుకోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీపరంగా కొంతకాలంగా బాగా వెనకబడి ఉందని, వారి మంత్రాంగం లోపభూయిష్టంగా ఉందని విమర్శలు వినబడుతున్న సంగతి తెలిసిందే. దానికి మరో నిదర్శనం తాజాగా బయటపడింది. ప్రత్యేకహోదాకోసం జగన్ నిరాహారదీక్ష తుస్సుమన్న సంగతి విదితమే. జగన్ ఏ లక్ష్యంతో ఈ దీక్షను చేశారో, దానిలో ఎంతమేరకు సఫలీకృతులయ్యారో ఆయనకే తెలియని పరిస్థితి ఉంది. క్లైమాక్స్‌కు చేరకముందే హర్ట్ రిటైర్ అయ్యి పెవిలియన్ దారిపట్టినట్లుగా దీక్ష ముగిసింది. ప్రజలలో స్పందన లేకపోవటంవలన ముగించారని కొందరు, ఇంకొన్నిరోజులు దీక్షను కొనసాగిస్తే టెంపో పెరిగి ప్రజలలో స్పందన వచ్చేదని కొందరు, ప్రాణభయంతో ప్రభుత్వానికి సహకరించాడని మరికొందరు – దీక్షపై రకరకాలుగా వాదనలు చేస్తున్నారు. ఏది ఏమైనా దీక్ష అనేది వైసీపీకి అడ్వాంటేజ్ కాకపోగా ఫెయిల్యూర్‌గా తేలింది. వైసీపీకి పలు ప్రధానాంశాలపై స్పష్టమైన వ్యూహం లేదనే విషయం మళ్ళీ రుజువయింది. శత్రువులో ఇంత మంచి బలహీనత దొరికితే దానిని పట్టుకుని దెబ్బకొట్టాల్సిన తెలుగుదేశం దీనిపై ఒక్కమాటకూడా స్పందించలేదు. ప్రభుత్వంపై బురద చల్లాలనే ఆలోచనేగానీ సమస్యలపై పరిష్కారంపట్ల చిత్తశుద్ధి లేదని ప్రజలలో ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఆ దిశగా ప్రయత్నాలేమీ చేయటంలేదు. ఎలాగోలా దీక్ష ముగిసి సమస్య పరిష్కారమైపోయిందని టీడీపీ నేతలు సంబరంలో మునిగిపోయినట్లుగా కనబడుతోంది.

మామూలుగా అయితే ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌లో రోజుకు రెండు, మూడు ప్రెస్‌మీట్‌లు పెట్టి జగన్‌పై విమర్శలు గుప్పించే గాలి, సోమిరెడ్డి జగన్ దీక్ష ఫెయిల్యూర్‌పై నోరు మెదపలేదు. అటు దూకుడుగా కనిపించే పయ్యావుల, ఉమాకూడా స్పందించకపోవటం విశేషం. అంటే దీనిపై వారికి దిశా నిర్దేశం చేయాల్సిన ఒక కేంద్రీకృత వ్యవస్థ, థింక్ ట్యాంక్ సరిగా లేదని అర్థమవుతోంది. ఇప్పటికైనా ఆ లోపాన్ని సరిచూసుకోకపోతే, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలలో మాత్రమే పై చేయిగా ఉన్న జగన్ – వచ్చే ఎన్నికలలోకూడా పైచేయి సాధించటం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com