నిప్పుతో చెలగాటం ఆడుతున్న తెదేపా, వైకాపాలు

ప్రస్తుతం ఏపిలో అధికార, ప్రతిపక్షాలు కాపులు, బీసీలతో చెలగాటమాడుతున్నాయి. అది నిప్పుతో చెలగాటమాడుతున్నట్లేనని వాటికీ చాలా బాగా తెలుసు. కానీ ఒకదానినొకటి రాజకీయంగా దెబ్బ తీసుకోవడానికే ఈ సాహసానికి పూనుకొన్నాయని చెప్పవచ్చును. ఈ విషయంలో తెదేపా తన హామీని నిలబెట్టుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడం వలననే ప్రతిపక్షానికి ఈ అవకాశం దక్కింది.

అధికార పార్టీని ఏదో విధంగా ఘోరంగా చావు దెబ్బ తీయాలని తపించిపోతున్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ప్రత్యేక హోదా విషయంలో ఎదురుదెబ్బ తగలినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఇంకా పగతో రగిలిపోతున్నారు. బహుశః అందుకే తన చేతికి మసి అంటకుండా ముద్రగడ పద్మనాభం భుజంపై తుపాకిని ఉంచి ఈ యుద్ధం మొదలుపెట్టారు. యుద్ధం మొదలుపెట్టారు కానీ దానిని ముగించడం ఇప్పుడు ఎవరి చేతిలోను లేకుండా పోయింది. కాపుల పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం మోకరిల్లుతున్నట్లు కనిపించగానే బీసీలు కూడా అప్రమత్తమయ్యి తమకు అన్యాయం చేస్తే సహించబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
“కాపులను మీరే రెచ్చగొట్టారని..” తెదేపా వైకాపాని నిందిస్తుంటే, “బీసీలను మీరే రెచ్చ గొట్టారని…” వైకాపా తెదేపాని నిందిస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ పోరాటాల కోసం రగిల్చిన ఈ రావణకాష్టం ఇప్పుడు రాష్ట్రాన్ని దహించివేసే ప్రమాదం కనబడుతోంది. రాష్ట్ర విభజన దెబ్బకి రాష్ట్రం ఇప్పటికీ తేరుకోలేకపోతోంది. ఆ తరువాత ప్రత్యేక హోదా కోసం జరిగిన ఉద్యమాలు రాష్ట్రంలో అశాంతికి దారి తీసాయి. మళ్ళీ ఇప్పుడు ఈ కాపు, బీసీ రిజర్వేషన్ల సమస్య కారణంగా రాష్ట్రం అట్టుడుకుతోంది. వీటి వలన రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు, పెట్టుబడులు రావడానికి కూడా అవరోధంగా మారవచ్చును. ఆ కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలవకుండానే నిలిచిపోయే ప్రమాదం ఉంది. అయితే రాష్ట్రానికి నష్టం కలుగుతున్నా కనీసం తెదేపా, వైకాపాలలో దేనికో ఒకదానికయినా ఈ గొడవల వలన లాభం చేకూరుతుందా? అంటే అదీ అనుమానమే.

ఈ సమస్యను ఆయుధంగా చేసుకొని తెదేపాను దెబ్బ తీయాలనే వైకాపా చేస్తున్న ప్రయత్నంలో ఆ పార్టీకి కూడా ఎదురుదెబ్బ తగలడం ఖాయం. ఈ సమస్యకు మూలకారణం తెదేపా ఇచ్చిన హామీ అయినప్పటికీ, కాపులను వెనుక నుండి రెచ్చగొట్టింది మాత్రం వైకాపాయేనని స్పష్టం అయింది కనుక బీసీలు దానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాపులను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నంలో ప్రభుత్వం తమకు అన్యాయం చేయవచ్చనే భయంతో దానిపై కూడా బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే రెండు పార్టీలు కూడా బీసీలను దూరం చేసుకొంటున్నాయన్న మాట. పోనీ కాపులనయినా ఆ రెండు పార్టీలు ప్రసన్నం చేసుకోగలుగుతాయా…అంటే అదీ సాధ్యం కాదని ప్రత్యక్షంగా కనబడుతోంది.

తెదేపా ప్రభుత్వం కాపులను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నాలు చేస్తూనే, విద్వంసానికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తోంది. ఆ కారణంగా వారు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. కాపుల పోరాటానికి వెనుక నుండి మద్దతు ఇస్తూనే మళ్ళీ బీసీలు దూరం అవుతారేమోననే భయంతో వారికీ అన్యాయం జరగకూడదు, అని వైకాపా వాదిస్తోంది. వైకాపా ప్రదర్శిస్తున్న ఈ ద్వంద వైఖరి కారణంగా వారు దానిపై కూడా ఆగ్రహంగా ఉన్నారు. కనుక రెండు పార్టీలు కూడా రెండు వర్గాలను దూరం చేసుకొనే అవకాశాలు కనబడుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ చదరంగంలో బీసీలను, కాపులను పావులుగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ అవి మొదలుపెట్టిన ఈ వికృత రాజకీయ చదరంగంలో ఏదో ఒక రోజున అవే పావులుగా మారి, అందుకు బారీ మూల్యం చెల్లించవలసి రావచ్చును. కనుక తక్షణమే ఈ ఆటని నిలిపివేయడమే ఆ రెండు పార్టీలకి క్షేమం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com