ఏ రాజకీయ పార్టీకి అయినా క్యాడరే బలం. ఆ క్యాడర్ అధినేత.. పై నాయకత్వం ఏది నిర్ణయిస్తే దాన్ని గుడ్డిగా అమలు చేసే క్యాడర్ ఉంటే.. ఆ పార్టీ పయనం సాఫీగా సాగుతుంది. పై స్థాయి వారు సరైన నిర్ణయం తీసుకుంటే..సరైన దారిలో వెళ్తుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే తప్పుడు దారిలో వెళ్తుంది. కానీ పార్టీ క్యాడర్ ఎక్కువగా సలహాలు ఇచ్చేవారు అయితే.. ఇలా కాదు..అలా అని ప్రతీ దానికి కాళ్లకు అడ్డం పడేవారు అయితే అనేక సమస్యలు వస్తాయి. ఇలాంటి లక్షణాల్లో వైసీపీకి ప్లస్ అయితే.. టీడీపీకి మైనస్ అవుతుంది.
జగన్ పార్టీ క్యాడర్ దూకంటే దూకేస్తారు !
జగన్ రెడ్డి మా నాయుకుడు ఆయన బంగాళాఖాతంలో దూకమంటే దూకేస్తాను అని తనను రామచంద్రాపురం నుంచి మార్చి.. రాజమండ్రి రూరల్ లో పడేసినప్పుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. జగన్ తనను తీసుకెళ్లి బంగాళాఖాతంలో పడేశారని ఆయనకు తెలుసు. కానీ ఆయన దూకేశారు. వైసీపీ క్యాడర్ కూడా అంతే. జగన్ ఏది చెబితే అది చేస్తారు. చదువుకోని వాళ్లు.. చదువుకున్న మూర్ఖులు ఆ పార్టీలో ఉంటారని అందుకే జగన్ ఏది చెబితే అదే అని.. ఒక్కరు కూడా ఎదురు చెప్పరని ఓ సారి రఘురామకృష్ణరాజు కూడా వ్యాఖ్యానించారు. వైసీపీ కార్యకర్తల దురదృష్టం ఏమో కానీ జగన్ రెడ్డి వాళ్లను ఎప్పటికప్పుడు బంగాళాఖాతంలో ముంచేస్తున్నారు. అలాంటి క్యాడర్ ను సరిగ్గా వాడుకోలేకపోతున్నారు. ఆ విషయం పక్కన పెడితే టీడీపీ పరిస్థితి భిన్నం.
టీడీపీలో అందరూ సలహాదారులే !
తెలుగుదేశం పార్టీకి కొంత వరకూ చదువుకున్న వారు, ఆలోచనలు ఉన్న వారు క్యాడర్ గా ఉన్నారు. చాలా మంది పార్టీలో ఇన్వాల్వ్ అయి పని చేస్తూ ఉంటారు. వీరికి ఉన్న సమస్య ఏమిటంటే..పార్టీ అధ్యక్షుడి కన్నా తామే తెలివిగలవాళ్లమని అనుకుంటూ ఉంటారు. చంద్రబాబుకు పార్టీ నడపడం రాదని అనుకుంటారు. ప్రభుత్వాన్ని సరిగ్గా అడ్మినిస్ట్రేట్ చేయడం లేదని అనుకుంటారు. అందుకే విపరీతమైన సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు ఎప్పుడో ఓ సారి మనోభావాలు దెబ్బతీసుకంటారు. అధికారంలో ఉంటే ఇంకా ఎక్కువ దెబ్బతీసుకుంటారు. అంతే.. వ్యతిరేకమయిపోతారు. వీరి సమస్య ఏమిటో వారికే తెలుసు. కానీ పార్టీకి.. అధినాయకత్వానికి అంత తీరిక ఉండదని.. వీరు గుర్తించలేరు. తన స్థాయిని మించి ఊహించుకుంటూ ఉంటారు. వీరి వల్ల పార్టీ విధానాల్లో క్యాడర్ కు స్పష్టత లేదని.. ఏకాభిప్రాయం లేదని బయట అనుకుంటూ ఉంటారు.
కరెక్ట్ చేయడం రెండు పార్టీలకూ సాధ్యం కాదు !
క్యాడర్ ను ఎలా వాడుకోవాలో తెలియక..వారిని బూతు రాయుళ్లుగా మార్చి వారి జీవితాలను నాశనం చేస్తున్న పార్టీ ఒకటి అయితే.. మితిమీరిన సలహాలు.. అతిగాళ్లతో టీడీపీ ఇబ్బంది పడుతోంది. ఈ రెండు పార్టీలు తమ క్యాడర్ విషయంలో ఇబ్బందులను అధిగమించలేవు. ఎందుకంటే సమస్య స్పష్టంగా తెలిసినా పరిష్కారం ఎవరి చేతుల్లో ఉందో.. వారే అర్థం చేసుకోలేకపోవడం. వైసీపీలో జగన్ అర్థం చేసుకోరు.. టీడీపీలో ఈ అతి.. సలహాల బ్యాచ్ కూడా అంతే. అందుకే.. ఈ పార్టీల ఇక్కట్లు ఇలా కొనసాగుతూనే ఉంటాయి.
