భారత క్రికెట్ జట్టుకు కొత్తగా స్పాన్సర్ కొరత వచ్చి పడింది. మనీ గేమ్‌లను నిర్వహించే డ్రీమ్ 11 మాతృ సంస్థ ఇప్పటి వరకూ స్పాన్సర్ గా ఉంది. టీమ్ ఇండియా జెర్సీలపై డ్రీమ్11 కనిపించేది. కానీ కేంద్రం.. ఇలాంటి మనీ గేమ్‌లు, బెట్టింగ్ గేములన్నింటినీ నిషేధించింది. చట్టం కూడా అమల్లోకి రావడంతో దుకాణం క్లోజ్ అయిపోయింది. ఇక టీమ్ ఇండియాను స్పాన్సర్ చేసి ఏం ప్రయోజనం అనుకుందేమో కానీ.. తమ వల్ల కాదని బీసీసీఐకి చెప్పేసింది డ్రీమ్ 11. ఇప్పుడు బీసీసిఐ కొత్త స్పాన్సర్ ను వెదుక్కునే పనిలో పడింది.
టీమ్ ఇండియాకు స్పాన్సర్ చేసే ఏ కంపెనీ కూడా బాగపడుతున్న దాఖలాలు లేవు. టీమ్ ఇండియాకు స్పాన్సర్ చేసి వ్యాపారాలను మూసేసుకోవాల్సి వచ్చిన వాటిలో డ్రీమ్ 11 నాలుగోది. 2010లో సహారా టీమ్ ఇండియాను స్పాన్సర్ చేసింది. చాలా కాలం చేసింది కానీ తర్వాత ఆర్థికపరమైన వ్యవహారాలతో తేడా కొట్టింది. కేసుల పాలయింది. వ్యాపారాలను మూసేసుకోవాల్సి వచ్చింది. తర్వాత ఫోన్ కంపెనీ ఒప్పో స్పాన్సర్ చేసింది. చైనాతో గొడవలతో ఆ కంపెనీలను కేంద్రం తరిమేయడంతో .. స్పాన్సర్ షిప్ రద్దు అయిపోయింది.
తర్వాత ఎడ్యూటెక్ సంచలనం బైజూస్ స్పాన్సర్ చేసింది. ఎంత వేగంగా ఎదిగిందో అంతే వేగంగా పడిపోయింది. చివరికి స్పాన్సర్ షిప్ డబ్బులు కూడా ఎగ్గొట్టేసింది. ఆ తర్వాత డ్రీమ్ 11 వచ్చింది. వందల కోట్ల ఆదాయాలు ఉన్నా… అవి బెట్టింగ్ డబ్బులు కావడంతో కేంద్రం నిషేధంతో ఆగిపోయాయి. ఇప్పుడు కొత్త స్పాన్సర్ ఎవరు వస్తారో కానీ.. పాపం అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఈ సెటైర్లు ఎలా ఉన్నా.. టీమిండియాకు ఉన్న క్రేజ్ కారణంగా.. పెద్దపెద్ద కంపెనీలు ఆసక్తి చూపే అవకాశం ఉందని మార్గెట్ వర్గాలు చెబుతున్నాయి.