తెలంగాణ రాజకీయాల్లో బీసీలకు చాంపియన్ అయిపోదామని గట్టిగా ప్రయత్నిస్తున్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రాబోయే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచి రాష్ట్రవ్యాప్త పాదయాత్రను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. బీసీలకు రాజ్యాధికారం కల్పించడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగనుందని మల్లన్న స్పష్టం చేశారు. ఆ రాజ్యాధికారం ఆయనకే అన్నమాట. గతంలోనే ఈ విషయాన్ని చెప్పారు. సీఎం అవుతానని కూడా ప్రకటించారు.
ఇప్పటికే దీనికి సంబంధించిన రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసినట్లు ఆయన అనుచర వర్గాలు వెల్లడించాయి. ఈ పాదయాత్ర వెనుక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మల్లన్న మద్దతుదారులు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం, కనీసం ఒక్క వార్డులో కూడా విజయం సాధించలేకపోవడం ఆయనకు కొంత నిరాశను మిగిల్చింది. ఎన్నికల ఓటమిని అధిగమించి, క్షేత్రస్థాయిలో కేడర్ సమీకరించుకునేందుకు పాదయాత్రను ఒక ఆయుధంగా మల్లన్న ఎంచుకున్నారు.
గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వచ్చిన ఆదరణను, ఇమేజ్ను తిరిగి సాధించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు. బీసీ నినాదాన్ని బలంగా వినిపిస్తూ, సామాజిక సమీకరణాలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని మల్లన్న భావిస్తున్నారు. గ్రామగ్రామాన పర్యటిస్తూ ప్రభుత్వంపై పోరాటంతో పాటు, అణగారిన వర్గాల గొంతుకగా నిలబడటం ద్వారా పోగొట్టుకున్న రాజకీయ ప్రాభవాన్ని పునరుద్ధరించుకోవాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే రాజకీయాల్లో ఆయనకు వచ్చిన ఇమేజ్ ఎమ్మెల్సీ పదవితోనే ఆగిపోయిందని… ఇప్పుడు ఆయనను నమ్మడం కష్టమన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది.