రివ్యూ: తేజ్‌ ఐ లవ్ యు

తెలుగు360.కామ్ రేటింగ్ : 2/5

ద‌ర్శ‌కుడు ఎంత మేధావైనా కావొచ్చు.

కానీ ప్రేక్ష‌కుల్ని తెలివిత‌క్కువ వాళ్లుగా అంచ‌నా వేయ‌కూడ‌దు.

వాళ్ల ద‌గ్గ‌రే త‌మ తెలివితేట‌ల్ని చూపించాల‌నుకుంటే.. గ‌ర్వ‌భంగం త‌ప్ప‌దు. ఈ విష‌యం క‌రుణాక‌ర‌న్‌కి బాగా తెలుసు.

ఎందుకంటే.. ‘ఎందుకంటే ప్రేమంట‌’లో ఇలానే త‌న మేధ‌స్సు బ‌య‌ట‌పెట్టాల‌ని చూశాడు. కోమాలో ఉన్న అమ్మాయిని ఆత్మ‌గా చూపించి అదే త‌న క్రియేటివిటీ అనుకోమ‌న్నాడు. ప్రేక్ష‌కులు న‌వ్వుకుంటూనే ఆ సినిమాని తిర‌స్క‌రించారు. మ‌ళ్లీ అలాంటి త‌ప్పు చేయొచ్చా?? కానీ.. దాన్నే సాహ‌సం అనుకున్న క‌రుణాక‌ర‌న్‌.. ఇప్పుడు మ‌రో ‘తింగ‌రి’ ప‌నిచేశాడు.

హీరోయిన్ హీరో ప్రేమ‌లో ప‌డుతుంది. ఆ ప్రేమ‌ని వ్య‌క్త‌ప‌రిచేలోగా గ‌తం మ‌ర్చిపోతుంది. అయితే మొత్తం కాదు.. హీరో ప్రేమ క‌థ మాత్ర‌మే. ఇదే ‘తేజ్‌’లో స్పెషాలిటీ. మ‌రి… ఇది ప్రేక్ష‌కులు రిసీవ్ చేసుకునేలా ఉందా? లేదంటే ‘ఎందుకంటే ప్రేమంట‌’ రిజ‌ల్ట్ రిపీట్ అయ్యేలా క‌నిపిస్తోందా?

క‌థ‌

లండ‌న్ నుంచి ఓ ప‌నిమీద ఇండియా వ‌స్తుంది నందిని (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌). త‌న‌ని తేజ్ (సాయిధ‌ర‌మ్ తేజ్‌) త‌గులుకుంటాడు. ఇద్ద‌రి మ‌ధ్య చిన్న చిన్న‌.. కోతి ప‌నులు. అంత‌లోనే నందినిపై తేజ్‌కీ, తేజ్‌పై నందినికి ప్రేమ చిగురిస్తుంది. నందినికి ‘ఐ ల‌వ్ యూ’ చెబుతాడు తేజ్‌. మ‌రుస‌టి రోజు నందిని కూడా తేజ్‌కి అదే మాట చెప్పాల‌నుకుంటుంది. అయితే… నందినికి యాక్సిడెంట్ అయి… గ‌తం మ‌ర్చిపోతుంది. గ‌తం అంటే అంతా కాదు.. ఇండియా వ‌చ్చిన త‌ర‌వాత ఏం జ‌రిగిందో ఆ పార్ట్ ఒక్క‌టే. అంటే… తేజ్‌, త‌న‌తో న‌డిపిన ప్రేమ‌క‌థ ఇవేం నందినికి గుర్తుండ‌వు. మ‌రి.. ఇలాంట‌ప్పుడు తేజ్ నందినికి గ‌తం గుర్తు రావ‌డానికి ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేశాడు..? అస‌లు నందిని ఇండియా ఎందుకొచ్చింది? అనేదే `తేజ్‌` క‌థా క‌మామిషు.

విశ్లేష‌ణ‌

హీరోల‌కు ఏదో ఓ రోగం ఆపాదించి హిట్లు కొట్టేశాయి కొన్ని సినిమాలు. ఈసారి హీరోయిన్ వంతు వ‌చ్చింది. అయితే ఇది రోగం కాదు.. గ‌తం మ‌ర్చిపోయింది అంతే. అదీ కొంత‌. నిజానికి ఈ కొంత మ‌ర్చిపోవ‌డం అనేది చాలా లాజిక్ లెస్‌గా ఉంది. అందులోంచే కామెడీ పుట్టించి… సీన్లు బాగా రాసుకుని, మెప్పించిగ‌లిగితే ఈ లోపం కూడా జ‌నం హాయిగా క్ష‌మించేద్దురు. కానీ.. అలాంటి ప్ర‌య‌త్నాలేం జ‌ర‌గ‌లేదు. క‌రుణాక‌ర‌న్ బ‌లం.. వినోదం. త‌ను కామెడీ సీన్లు బాగా రాసుకుంటాడు. కొత్త‌గా ఉన్నా ఉండ‌క‌పోయినా.. అవి బాగా వ‌ర్క‌వుట్ అవుతాయి. తొలిప్రేమ నుంచి.. ఉల్లాసంగా ఉత్సాహంగా వ‌ర‌కూ వినోదమే అత‌ని బ‌లం. ఇందులో హీరో, హీరోయిన్ల మ‌ధ్య ల‌వ్ ట్రాక్‌కి కామెడీగా న‌డిపిద్దామ‌నుకున్నాడు. అది ఒక్కో చోట వ‌ర్క‌వుట్ అయ్యింది. ఒక్కోచోట కాలేదు. పైగా.. సాగ‌దీత‌లా అనిపిస్తుంది. ఎగ్రిమెంట్లు చేయించుకుని.. దాన్ని అడ్డం పెట్టుకుని, ఒకొర్ని ఒక‌రు ఆడుకోవ‌డం ఏమిటో అనిపిస్తుంది. హీరో – హీరోయిన్ల‌ను క‌ల‌పాల‌న్న ఉద్దేశంతో గ‌తం మ‌ర్చిపోయిన నందినికి కొన్ని క‌ట్టు క‌థ‌లు వినిపిస్తారు హీరో బ్యాచ్‌. వాటిని నందిని న‌మ్మేస్తుంది కూడా. నందిని ఏం చెప్పినా న‌మ్ముతుంది అన్న‌ప్పుడు.. నందినికి నిజ‌మే చెప్పేయొచ్చు క‌దా?

దాన్ని దాయ‌డం ఎందుకు? విశ్రాంతి త‌ర‌వాత‌.. క‌రుణాక‌ర‌న్‌ని ఈ క‌థ ఎలా న‌డ‌పాలో అర్థం కాలేదు. అందుకే హీరోయిన్‌ని తీసుకెళ్లి హీరో ఇంట్లో పెట్టాడు. అక్క‌డ తేజ్‌కీ, అత‌ని పెద‌నాన్న‌కీ మ‌ధ్య జ‌రిగే అపార్థాలన్నీ తొల‌గిపోవ‌డం లాంటి సెంటిమెంట్ స‌న్నివేశాల‌తో కాస్త కాల‌క్షేపం చేశాడు. క్లైమాక్స్ కూడా ఫోర్డ్స్‌గా అనిపిస్తుంది. క‌థ‌ని ఇంకాస్త సాగ‌దీయాలి కాబ‌ట్టి… లేనిపోని డ్రామా పండిచ‌డానికి చూసి, తేజ్ – నందినిల‌ను మ‌రోసారి దూరం చేశాడు ద‌ర్శ‌కుడు. అలా.. క‌థ‌ని త‌న ఇష్టానుసారం తిప్పుకుంటూ తిప్పుకుంటూ వెళ్లిపోయాడు.

తొలిప్రేమ‌తో ఈసినిమాని పోలుస్తూ.. విడుద‌ల‌కు ముందు చిత్ర‌బృందం స్టేట్‌మెంట్లు ఇచ్చింది. ఆ సినిమాకీ ఈ సినిమాకీ ర‌ద్ద‌యిపోయిన పాత నోట్ల‌కూ.. కొత్త రెండు వేల నోటుకీ ఉన్నంత తేడా ఉంది. ఈ విష‌యం సినిమాప్రారంభ‌మైన కాసేప‌టికే అర్థ‌మైపోతుంది. అయితే తొలి ప్రేమ రిఫెన్సులు ఈ సినిమాలో చాలా క‌నిపిస్తాయి. ఓ ప్ర‌మాదం నుంచి హీరోయిన్‌ని హీరో కాపాడి.. అక్క‌డి నుంచి ఇద్ద‌రూ ద‌గ్గ‌ర‌వ్వ‌డం ‘తొలిప్రేమ‌’ స్టోరీ. ఈ సినిమాలో హీరోయిన్ అమ్మ‌ని కాపాడి…హీరోయిన్ మ‌న‌సు గెలుచుకుంటాడు హీరో. తొలిప్రేమ‌లా… తేజ్ క్లైమాక్స్ కూడా ఎయిర్ పోర్ట్‌లోనే. అంతెందుకు? తొలి ప్రేమ‌లో.. పెద‌నాన్న‌, పెద్ద‌మ్మ‌.. వాళ్ల అమ్మాయితో హీరోకి బ‌ల‌మైన రిలేష‌న్‌ని చూపిస్తారు. ఇందులోనూ అంతే. అలా.. తొలిప్రేమలో వర్క‌వుట్ అయిన కొన్ని ఫార్ములాల్ని ఈ సినిమాలో వాడుకున్నా ఫ‌లితం ద‌క్క‌లేదు.

న‌టీన‌టులు

తేజ్ ఈమ‌ధ్య బాగా లావుగా క‌నిపిస్తున్నాడు. దాంతో గ్లామ‌ర్ దెబ్బ‌తింది. అయితే ఈసినిమాలో మాత్రం బాగానే క‌నిపించాడు. అత‌ని డ్ర‌స్సింగ్‌సెన్స్ బాగుంది. హుషారైన స‌న్నివేశాల్లో బాగా క‌నిపించాడు. నీర‌సంగా క‌నిపించాల్సిన చోట మాత్రం.. ప్రేక్ష‌కుల‌కు నీర‌సం తెప్పించాల‌ని చూశాడు. సెంటిమెంట్ డైలాగులు ప‌లికేట‌ప్పుడు కాస్త ఇబ్బంది ప‌డుతున్నాడు. అనుప‌మ ఎప్ప‌ట్లా ప‌ద్ధ‌తిగా ఉంది. బాగా న‌టించింది కూడా. అయితే.. అక్క‌డ‌క్క‌డ కొన్ని ఓవ‌ర్ ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చింది. మేక‌ప్ కూడా ఓవ‌ర్ అయ్యింది. తేజ్‌, అనుప‌మ‌ల జోడీ మాత్ర‌మే ఈసినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. క‌రణాక‌ర‌న్ సినిమాల్లో గ్రూప్ ఫొటో స్టిల్లులు ఎక్కువ‌. ఎక్క‌డ చూసినా జ‌నం గుంపులు గుంపులుగా ఉంటారు. కాక‌పోతే… వాళ్ల‌లో ఒక్క‌రి పాత్ర కూడా ఎలివేట్ అవ్వ‌దు. ఈసినిమా కూడా అందుకు మిన‌హాయింపు కాదు. ఫృద్వీ, వైవాహ‌ర్ష‌ల‌ను స‌రిగా వాడుకోలేదు.

సాంకేతికత‌

టెక్నిక‌ల్‌గా సినిమా బాగుంది. ముఖ్యంగా కెమెరా ప‌నిత‌నం. సినిమాని ఓ రంగుల హ‌రివిల్లులా చూపించారు. ఆఖ‌రికి ఫైట్ సీన్‌ని కూడా ఓ రైన్ బోలా మార్చేశాడు ఆండ్రూ. గోపీ సుంద‌ర్ పాట‌ల్లో ఒక‌ట్రెండు ఓకే అనిపించాయి. డార్లింగ్ స్వామి డైలాగులు అక్క‌డ‌క్క‌డ పేలాయి. ద‌ర్శకుడిగా క‌రుణాక‌ర‌న్ మ‌రోసారి విఫ‌ల‌య్యాడు. ఓ లాజిక్ లెస్ పాయింట్ ప‌ట్టుకుని, దాన్ని ల‌వ్ స్టోరీగా మ‌లుద్దామ‌నుకున్నాడు. కానీ… స్క్రిప్టులో చేసిన త‌ప్పుల వ‌ల్ల అనుకున్న ల‌క్ష్యం చేరుకోలేక‌పోయాడు.

తీర్పు

డ‌బ్బులు బాగా ఖ‌ర్చు పెట్టి తీశార‌ని ఫ్లాప్ సినిమాని హిట్ చేస్తారా? – ఇది ఈ సినిమాలోని డైలాగే. అది ఈ సినిమాకీ వ‌ర్తిస్తుంది. ఓ అంద‌మైన జంట‌ని ఎంచుకున్నారు, మంచి కెమెరామెన్‌ని తీసుకున్నారు, హ‌మ్ ఆప్ కే హై కౌన్ లెవిల్లో…
ఫ్రేమ్ ప‌ట్ట‌నంత మంది ఆర్టిస్టుల్ని తీసుకొచ్చారు. డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టారు. కానీ ఏం లాభం? సినిమాకి ప్రాణ‌మైన క‌థ విష‌యంలో.. కొత్త‌గా ఆలోచించ‌లేక‌పోయారు. పోనీలే అనుకుంటే.. ఓ లాజిక్ లేని పాయింట్ ప‌ట్టుకుని.. ప్రేక్ష‌కుల తెలివితేట‌ల్ని ప‌రీక్షిద్దామ‌నుకున్నాడు. అందుకే తేజ్ ఐ ల‌వ్ వ్యూ… అనాల్సిన‌వాళ్లంతా.. ఇప్పుడు ఆ ధైర్యం చేయ‌లేక‌పోతున్నారు.

ఫినిషింగ్ ట‌చ్‌: ఆవ‌కాయ్ పులిహోర‌

తెలుగు360.కామ్ రేటింగ్ : 2/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com