శనివారం తెలంగాణ బంద్‌కు బీసీ సంఘాల తరపున ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. అన్ని పార్టీల ఆఫీసులకు వెళ్లి మద్దతివ్వాలని కోరారు. అందరూ మా మద్దతు ఖాయమన్నారు. బహిరంగ ప్రకటనలు చేశారు. అంతా బాగానే ఉంది..మరి ఇప్పుడు డిమాండ్లను ఎవరికి చెబుతారన్నది మాత్రం.. బంద్ పాటించే వాళ్లకూ అయినా క్లారిటీ ఉందో లేదో వారికే తెలియాలి.
కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇచ్చేందుకు తాము చేయాల్సినన్నీ చేస్తున్నామని ..బంద్‌కు మా మద్దతు ఉంటుందని ప్రకటించింది. బీజేపీ అడ్డుకుంటోందని భట్టి విక్రమార్క ఆరోపించారు. బీజేపీ తరపున స్వయంగా ఎంపీగా ఉన్న కృష్ణయ్యే బంద్ పిలుపునిచ్చారు. ఆ పార్టీ కూడా బంద్ కు మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీనే మోసం చేసిందని ఆరోపిస్తోంది. ఇక బీఆర్ఎస్ కూడా మద్దతు పలికింది. రెండు పార్టీలు మోసం చేస్తున్నాయని విమర్శించింది. కల్వకుంట్ల కవితతో పాటు కమ్యూనిస్టులు కూడా మద్దతు పలికారు.
అందరూ కలిసి బంద్ చేసి..తమ డిమాండ్లను తీర్చాలని ఎవర్ని డిమాండ్ చేయబోతున్నారన్నది ఇప్పుడు కీలకం. కోర్టులపై వీరు దండెత్తాలనుకుంటున్నారా?. బంద్‌లు, ఆందోళనలలతో కోర్టులను ప్రభావితం చేయడం సాధ్యమేనా ?. ఆర్ కృష్ణయ్యకు ఈ బంద్ ఆలోచన ఎలా వచ్చిందో కానీ.. పండుగ సందర్భంగా చాలా కార్యాలయాలకు సెలవు. స్కూళ్లకు సెలవు. వ్యాపారాలు ఆపేందుకు ఎవరూ సిద్ధపడరు. అందుకే బంద్ తేలిపోయే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.