తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా పాలసీ తీసుకు వస్తోంది. గిగ్ వర్కర్లు అంటే మొబిలిటీ, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఈ కామర్స్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పని చేసేవారు. వారితో పాటు ఇళ్లలో పని చేసే వారిని కూడా ఈ కేటగిరిలో చేర్చారు. యాప్స్ సేవలకు కీలకంగా ఉన్న వీరంతా సరైన సామాజిక భధ్రత లేకుండానే ఉంటున్నారు. వీరందరికీ భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టం
తెలంగాణ ప్రభుత్వం గిగ్, ప్లాట్ఫామ్ కార్మికుల సంక్షేమం.. భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్లాట్ ఫారమ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ యాక్ట్ 2025 బిల్లును తీసుకు రావాలని నిర్ణయించింది. హైదరాబాద్ మెట్రో కావడంతో పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి యువత వచ్చి గిగ్ వర్కర్లుగా పని చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్కర్స్, ప్లాట్ ఫారం బేస్డ్ వర్కర్స్ ఉన్నారని అంచనా. వీరికి ఎటువంటి సెలవులు లేకపోగా రోజుకు 10 నుంచి 12 గంటలు పని చేయాల్సి వస్తోంది.
ఎలాంటి సామాజిక భరోసా లేని గిగ్ వర్కర్ల జీవితాలు
గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత అనేది ఉండదు. అలాగే బీమా సౌకర్యం, చెల్లింపుల విషయంలో స్పష్టమైన విధానాలు లేవు. వీరి శ్రమను దోపిడీ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. గిగ్ వర్కర్ల సంక్షేమం, భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని ఎన్నికల మేనిఫెస్టోలోనే మా ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ఓ సారి గిగ్ వర్కర్లు, సంబంధిత ప్రతినిధులతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు.
వారితో పలుమార్లు సంప్రదింపులు జరిపి గిగ్ వర్కర్ల సంక్షేమానికి ఈ బిల్లును తీసుకొచ్చింది.
గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు
కొత్త చట్టం ద్వారా గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపు, సామాజిక భద్రత లభిస్తాయి. వీరందరి సంక్షేమానికి ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేసి హక్కులకు రక్షణ కల్పిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గిగ్ వర్కర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వారికి చట్టబద్ధంగా లభించాల్సిన అన్ని అంశాలకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో గిగ్ వర్కర్ల సంక్షేమానికి కొంత ప్రయత్నాలు జరిగాయి. కానీ పెద్దగా విజయవంతం కాలేదు. తెలంగాణ ప్రభుత్వం నిజాయితీగా వారికి మేలు జరిగేలా చేస్తే మాత్రం.. కొన్ని లక్షల జీవితాలకు భరోసా, భద్రత కల్పించినట్లవుతుంది.
