తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి ఒక మిశ్రమ అనుభవాన్ని, అంతకంటే ఎక్కువగా ఒక గట్టి హెచ్చరికను మిగిల్చాయి. రాష్ట్రంలో అధికారానికి ప్రత్యామ్నాయం మేమే అని గట్టిగా వినిపించే బీజేపీ నేతల మాటలకు, క్షేత్రస్థాయిలో వస్తున్న ఫలితాలకు మధ్య పొంతన లేకపోవడం ఆ పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు సాధించే సత్తా ఉన్న పార్టీ, స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి కేవలం ఓట్ల శాతం పెంచుకోవడానికే పరిమితమవ్వడానికి కారణం వ్యూహాత్మక లోపాలే.
లోకల్ పోల్స్‌లో చతికిలబడుతున్న వ్యూహాలు
పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ఇమేజ్ , జాతీయ అంశాల మీద బీజేపీ గెలుపు గుర్రం ఎక్కుతోంది. కానీ, మున్సిపల్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి స్థానిక సమస్యలు, అభ్యర్థుల బలం , క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ ముఖ్యం. ఇక్కడే బీజేపీ విఫలమవుతోంది. అవకాశం ఉన్నప్పుడు స్థానిక కమిటీలను బలోపేతం చేసుకోవడంలో, ప్రజలతో మమేకమవ్వడంలో పార్టీ నేతలు విఫలమవుతున్నారు. ఫలితంగా ఓట్ల శాతం పెరిగినప్పటికీ, అది గెలుపు మెట్ల వరకు చేరుకోవడం లేదు. ఈ వ్యూహాత్మక తప్పిదం కారణంగానే బీజేపీ మళ్ళీ మూడో స్థానానికే పరిమితం కావాల్సి వస్తోంది.
గ్రూపు రాజకీయాల సెగ
బీజేపీని వేధిస్తున్న అతిపెద్ద సమస్య అంతర్గత కలహాలు . పార్టీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయో లెక్కగట్టడం కష్టమన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సీనియర్లకు, కొత్తగా చేరిన వారికి మధ్య సమన్వయం లేకపోవడం, ఎవరికి వారు తామే పవర్ఫుల్ అని చాటుకోవాలనే తపన పార్టీ ఎదుగుదలను దెబ్బతీస్తోంది. ఈ గ్రూపు తగాదాల వల్ల పార్టీ కేడర్ అయోమయానికి గురవుతోంది. ఒక బలమైన నాయకుడి కింద పని చేయడానికి నేతలు సుముఖంగా లేకపోవడం వల్లే హైకమాండ్ చివరకు వివాదరహితుడైన సీనియర్ నేత రామచంద్రరావు కు పగ్గాలు అప్పగించాల్సి వచ్చింది.గ్రూపు గొడవలను తట్టుకుంటూ, అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో రామచంద్రరావు ఇంకా వేగంగా స్పందించాల్సి ఉంది.
రేసులోకి రావాలంటే మారాల్సిందే!
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే, బీజేపీ మళ్ళీ రేసులోకి రావాలంటే నాయకులందరూ తమ వ్యక్తిగత ఇగోలను పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పనిచేయాలి. ఎందుకు గెలవలేకపోయామో ఆత్మపరిశీలన చేసుకోవాలి. కింద స్థాయి నుంచి బలమైన నాయకత్వాన్ని తయారు చేయకపోతే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. బీఆర్ఎస్ బలహీనపడుతున్న ఈ సమయంలో, ఆ శూన్యాన్ని భర్తీ చేసే అవకాశం బీజేపీకి ఉన్నప్పటికీ, దానిని అందిపుచ్చుకోవడంలో వెనుకబడుతోంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు..కానీ కావాల్సింది ఆ పార్టీ నాయకత్వంలోని పట్టుదలే.
