తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి రేసు చాలా సీరియస్ గా సాగుతోంది. అవసరమైతే కేంద్ర మంత్రి పదవుల్ని వదులుకుంటాం.. తమనే చీఫ్గా నియమించాలని.. కొనసాగించాలని బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా హైకమాండ్ వద్ద తమ ప్రతిపాదనలు ఉంచారు. ఈటల రాజేందర్ తనకే పదవి అని అందుకే మోదీ తనకు ప్రత్యేకంగా అపాయింట్ మెంట్ ఇచ్చారని ప్రచారం చేసుకుంటున్నారు. రెండు రోజుల కిందట పార్లమెంట్ ప్రాంగణంలో ఆటల రాజేందర్ ఫ్యామిలీతో మోదీ ఫోటోలు దిగారు. ఇక తనకు తిరుగులేదని ఈటల అనుకుంటున్నారు.
కానీ ఈటల రాజేందర్ కు అసలు పార్టీలో సపోర్టు లేదు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాత్రమే కాదు మురళీధర్ రావు లాంటి పాత నేతలు కూడా ఆయనకు సపోర్టుగా లేరు. అసలు ఈటల రాజకీయ అవసరం కోసం పార్టీలో చేరారని చాలా మంది గుర్తు చేస్తున్నారు. అందుకే ఆయనను అధ్యక్షుడిగా వద్దని అంటున్నారు. డీకే అరుణ, రఘునందన్ రావులు కూడా తమకు చాన్స్ కోసం చూస్తున్నారు. బీజేపీ చీఫ్ పదవికి ఇంతగా డిమాండ్ పెరగడానికి కారణం ఉంది. ఇప్పుడు నియమితులయ్యే అధ్యక్షుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ ఉంటారు.
ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి మంచి అవకాశాలు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో చీఫ్ గా ఉండి పార్టీని గెలిపిస్తే సీఎం పదవి వస్తుందని నమ్మకంతో ఉన్నారు. తాము పార్టీలో ఉండి కష్టపడిన దాన్ని బట్టి తమకు అవకాశం రావాలంటే ఈ సమయంలో పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని అనుకుంటున్నారు. మరి ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో చూడాల్సి ఉంది.