తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకూ పాత సమస్యలే వెంటాడుతున్నాయి. ఆయన నాయకత్వాన్ని అంగీకరించడానికి చాలా మంది సీనియర్ నేతలు సిద్ధంగా లేరు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు .. ఆయనను లెక్క చేసేందుకు సిద్ధంగా లేరు. ఆయన నేతృత్వంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశాలు పెడితే పెద్దగా పట్టించుకున్నవారు లేరు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా గెలవలేని ఆయన మాకు పాఠాలు చెప్పడంఏమిటన్నట్లుగా ఉన్నారు.
తెలంగాణ బీజేపీకి అతి పెద్ద సమస్యగా నాయకత్వం ఉంది. అందరూ గౌరవించి.. అందరూ ఆదేశాలు పాటించేనాయకుడ్ని ఎంపిక చేయలేకపోయారు. క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారో లేదో అన్నట్లుగా వ్యవహరిస్తున్న నేతకు చాన్స్ ఇచ్చారు. ఆయన వెనుక బండి సంజయ్ అన్నారని ప్రచారం జరుగుతున్నా..ఆయనకు బలంగా నిలబడటంలో చాలా మంది ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఏకతాటిపైకి రావాల్సిన పార్టీ ఎప్పట్లాగే ఎవరికి వారు అన్నట్లుగా సాగుతోంది.
కిషన్ రెడ్డి బీజేపీ చీఫ్ గా ఉన్నప్పుడు.. ఆయన కు తీరిక ఉండేదికాదు. వారాంతాల్లో పార్టీకి కేటాయించేవారు. దాంతో సరైన దిశానిర్దేశం లేక అందరూ సైలెంటుగా ఉండేవారు. పార్టీతరపున కాకుండా సొంత నిర్ణయాలతో రాజకీయాలు చేసేవారు. ఇప్పుడు కొత్త అధ్యక్షుడ్ని నియమించినా అదే సమస్య వస్తోంది. అధ్యక్షుడు చెప్పేది వినేదేంటి.. మా రాజకీయాలు మేం చేసుకుంటామన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దాంతో కొత్త అధ్యక్షుడు వచ్చినా బీజేపీలో పరిస్థితేం మారలేదని కార్యకర్తలు ఫీలవుతున్నారు.