“మోదీతో విందులో జరిగిన చర్చల్ని బయటపెట్టిన వారెవరు?. మోదీ బయటకు చెప్పవద్దనిచెప్పారు?. బయటకు చెప్పిన వారిపై చర్యలు తీసుకుంటాం”..అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో ఆవేశపడ్డారు. ఆయన అలా అన్నారు కానీ ఆ సమావేశంలో మోదీ ఎం చెప్పారో ఆయన కూడా ఈ మీడియా చిట్ చాట్ లో చెప్పారు. ఒడిషాలో బలమైన నేతలు లేరు కానీ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో అలా కలసి కట్టుగా ప్రయత్నించాలని చెప్పారు. కానీ తెలంగాణ నేతలు ఏం చేస్తున్నారు?. చివరికి మోదీతో సమావేశం వివరాలు లీక్ అయ్యాయని అంతర్గత రాజకీయాలు చేసుకుంటున్నారు.
తెలంగాణ బీజేపీ రాను రాను నిర్వీర్యం
తెలంగాణ బీజేపీ రాను రాను కుంచించించుకుపోతోంది. దానికి పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ తో లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్న చోట ఆ పార్టీకి మంచి ఫలితాలు వస్తున్నాయి. కానీ తమ పార్టీ ప్రజా ప్రతినిధులు ఉన్న చోట కూడా భారీ విజయాలు దక్కించుకోలేకపోతోంది. ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు. వారంతా మంచి మెజార్టీలతో గెలిచారు. కానీ పంచాయతీ ఎన్నికలను పట్టించుకోవడం లేదు. ఈటల రాజేందర్ మల్కాజిగిరి కన్నా హుజూరాబాద్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇతర ఎంపీలూ అంతే.
అందరూ కలసి కట్టుగా పని చేయాలనే రామచంద్రరావుకు పదవి
ఎవరికి పదవి ఇస్తే ఎవరు అసంతృప్తికి గురవుతారోనన్న ఉద్దేశంతో అందర్నీసమానంగా ఉంచుతూ.. ప్రధాన పదవులకు పెద్దగా పోటీ పడని రామచంద్రరావును అధ్యక్షుడిగా నియమించారు. కానీ ఈ నియామకాన్ని బీజేపీ నేతలు వేరేగా తీసుకున్నారు. అసలు పని చేయడం మానేసారు. కొంత మంది అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. తెలంగాణ బీజేపీలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ తో పాటు డీకే అరుణ, రఘునందన్ రావు లాంటి వాళ్లు ఉన్నారు. అందరూ ఎప్పుడూ ఒక్క మాట మీద లేరు. ఎవరి రాజకీయాలు వారు చేస్తున్నారు. వీరిలో ఎవరికైనా అధ్యక్ష పదవి వచ్చి ఉంటే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. ఇప్పుడు రామచంద్రరావు చెప్పిన మాట వినరు. పార్టీ తరపున పోరాటం చేయరు. దీంతో హైకమాండ్ రామచంద్రరావు నియామకంలో చేసిన ప్రయోగం రివర్స్ అయినట్లయింది.
ప్రధాని మోదీ ఎన్ని సార్లు చెబుతారు ?
బండి సంజయ్ నాయకత్వం ఉన్నప్పుడు ఆ పార్టీ పరిస్థితి మెరుగ్గానే ఉండేది. కానీ ఆయన ఎదుగుదల చాలా మందికి నచ్చలేదు. అందుకే నియంత్రించారు. చివరికి ఇప్పుడు అటూ ఇటూ కాకుండా అయిపోయింది. అటు ఈటలను ప్రోత్సహిస్తే బండి సంజయ్ ఒప్పుకోరు. బండి సంజయ్ ను ప్రోత్సహిస్తే ఈటల, కిషన్ రెడ్డి అంగీకరించరు. పార్టీ నేతల మధ్య ఏ మాత్రం సరిపడని ఈ రాజకీయాన్ని మోదీ ఎంతో కాలం సహించే అవకాశం లేదు. పార్టీ పరిస్థితి మెరుగుపడకపోతే ఆయన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
