చూస్తేనే వణుకు…ఇక మాటలెక్కడ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంత. మొండోడు. ఎవ్వరి మాట వినని సీతయ్య…తెలంగాణ ప్రజల్లో, ప్రతిపక్షాల్లో ఉన్న అభిప్రాయం. అయితే ఇదే అభిప్రాయం రాష్ట్ర మంత్రుల్లో, టీఆర్‌ఎస్‌ నాయకుల్లోనూ ఉంది. ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక ఈ అభిప్రాయం మరింత బలపడటమే కాదు, కేసీఆర్‌ను చూస్తేనే మంత్రులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వంలో భాగం కాని ఆర్‌టీసీ కార్మికులే ‘బతికుంటే బలుసాకు తినొచ్చు’ అనే సామెత మాదిరిగా సమ్మెకు, డిమాండ్లకు స్వస్తి చెప్పి ‘మమ్మల్ని విధుల్లో చేర్చుకోండి మహానుభావా…మిమ్మల్ని శరణు కోరుతున్నాం’ అంటూ డిపోలకు పరుగులు తీసి క్యూ కట్టారు. అలాంటిది ప్రభుత్వంలో భాగమైన, పొద్దున్నే లేస్తే కేసీఆర్‌ మొహం చూడాల్సిన మంత్రులు ఆయనంటే వణికిపోవడం, భయపడటం, నోరు మెదకుండా ‘ఎస్‌ సర్‌’ అనడం అసహజమేమీ కాదు. ఇది అందరికీ తెలిసిందే.

అయితే ఇలా వణికిపోవడం మరోసారి బయటపడింది. ఈరోజు కీలకమైన మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ప్రధానంగా ఆర్టీసీ మీద చర్చిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థను ఏదో ఒకటి చేయాలని సీఎం పట్టుదలగా ఉన్నాడు కదా. ఈ కేబినెట్‌ భేటీలో ముఖ్యమంత్రి, టీచరు పిల్లగాళ్లను అడిగినట్లుగా ‘ఏంది..ఆర్టీసీ కత? క్షేత్రస్థాయిలో ప్రజాస్పందన ఎట్లుంది? జనం ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇస్తున్నరా? ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నరా?’…అని అడిగారు. అంతే..స్కూలు పిల్లకాయల్లాగా బిగుసుకుపోయి కూర్చున్నారు మంత్రులు. రవాణా మంత్రితో సహా ఒక్కరూ నోరు విప్పలేదు. ఏం చెబితే ఏమంటాడో తెలియదు.

మంత్రులకు విషయాలు తెలియకుండా ఉండవు. వాళ్లకూ కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలుంటాయి. హరీష్‌రావువంటి మంత్రులకు ఆర్‌టీసీ కార్మికులతో సన్నిహిత సంబంధాలున్నాయి. వారి సమస్యలపై అవగాహన ఉంది. పువ్వాడ అజయ్‌ కుమార్‌ రవాణా శాఖకు కొత్తగా మంత్రి అయినప్పటికీ సుదీర్ఘ సమ్మె నేపథ్యంలో ఆయనకూ అంతో ఇంతో తెలియకుండా ఎలా ఉంటుంది. కాని మంత్రులంతా సైలెంట్‌ అయిపోయినట్లు సమాచారం. ఏదైనా మాట్లాడి, అది కేసీఆర్‌కు కోపం తెప్పిస్తే శంకరగిరి మాన్యాలు పట్టిపోతామనే భయం ఉంది. ఆర్‌టీసీ సమ్మె మొదలైన మొదటి రోజు నుంచి టోటల్‌గా కేసీఆరే డీల్‌ చేస్తున్నాడు. సమీక్షల మీద సమీక్షలు ఆయనే చేశాడు. సెల్ఫ్‌ డిస్మిస్‌ సహా అన్ని ప్రకటనలు ఆయనే చేశాడు.

రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ నామమాత్రంగా సమీక్షా సమావేశాల్లో కూర్చునేవాడు. ఆర్‌టీసీ మీద తనకు అవగాహన లేదని మంత్రి పదవి స్వీకరించిన మొదటి రోజే చెప్పేశాడు. దీంతో కేసీఆరే పగ్గాలు తీసుకున్నాడు. అలా తీసుకున్నాడు కాబట్టే ఆర్‌టీసీ కార్మికులను వామనడు బలి చక్రవర్తిని తొక్కేసినట్లు తొక్కేశాడు. పిడికిళ్లు ఎత్తినవారే సాష్టాంగ నమస్కారాలు చేసేలా చేయగలిగాడు. ఆర్‌టీసీ సమ్మెకు మద్దతు ఇచ్చి కేసీఆర్‌ అంతు చూస్తామని చొక్కాలు చింపుకున్న ప్రతిపక్ష నేతలు ఇప్పుడు చింపుకున్న చొక్కాలు కుట్టించుకునే పనిలో ఉన్నారు. సమ్మె సమయంలో ప్రతిపక్ష నేతలు చాలాసార్లు ‘హారీష్‌రావు ఎందుకు మాట్లాడటంలేదు? ఈటల రాజేందర్‌ ఎందుకు గమ్మున ఉన్నాడు’ అంటూ రెచ్చగొట్టారు.

వాళ్లు నోరు విప్పితే మళ్లీ జీవితంలో మాట్లాడే అవకాశం రాకుండా కేసీఆర్‌ చేయగలడు. కొందరు మంత్రులకు ఆర్‌టీసీ కార్మికుల పట్ల సానుభూతి ఉండొచ్చు. వారి బాధలు చూసి కరిగిపోవచ్చు. వారి మరణాలు చూసి చలించివుండొచ్చు. కాని పెదవి విప్పి ఒక్క మాటా మాట్లాడలేదు. మంత్రులే మాట్లాడనప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు ఎందుకు మాట్లాడతారు? అందులోనూ సమ్మె ఉదృతంగా జరుగుతున్నప్పుడే హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది. ఇంక మాట్లాడే ఆస్కారం ఎక్కడిది? ఈ సీతయ్యను కాదంటే గులాబీ నేతలు గుబాళించరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com