తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం విచారణల రాజకీయం పతాక స్థాయికి చేరింది. సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విసిరిన సవాల్ ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక లేఖ రాస్తే చాలని, విచారణకు తాము సిద్ధమని ఆయన చెబుతున్నారు. అయితే సింగరేణి కంటే అత్యంత భారీ కుంభకోణంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీబీఐ విచారణకు లేఖ రాసినా స్పందన లేదు. ఆ కేసు కోల్డ్ స్టోరేజీలోకి వెల్లింది.
కాళేశ్వరం అక్రమాలపై కదలని సీబీఐ
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలని గత ఏడాది సెప్టెంబర్‌లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి, లేఖ రాశారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ప్రకారం అక్రమాలు జరిగాయని స్వయంగా కిషన్ రెడ్డి కూడా పలుమార్లు ఆరోపించారు. కానీ, క్షేత్రస్థాయిలో విచారణ ప్రక్రియ అడుగు ముందుకు పడలేదు. కేసును సీబీఐ తీసుకుంది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఎలాంటి విచారణలు ప్రారంబం కాలేదు. కానీ కిషన్ రెడ్డి ఇప్పుడు సింగరేణి పై సీబీఐ విచారణకు లేఖ రాస్తే చేయిస్తామని అంటున్నారు.
బురద చల్లుకోవడమే రాజకీయం
రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడమే పనిగా పెట్టుకున్నాయి. సింగరేణి టెండర్లలో అక్రమాలు జరిగాయని హరీష్ రావు లేఖ లు రాశారు. కేటీఆర్ అదే పనిగా ఆరోపణలు చేస్తున్నారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన స్కామ్‌లపై ఎందుకు మాట్లాడటం లేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. మరోవైపు, ఫోన్ ట్యాపింగ్ వంటి కేసులతో ప్రభుత్వం తమను ఇబ్బంది పెడుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ రాజకీయ యుద్ధంలో అసలు విచారణలు జరిగి నిజాలు బయటకు వస్తాయా లేక కేవలం ప్రచారానికే పరిమితమవుతాయా అన్నది సందేహంగా మారింది.
అందరిదీ డైవర్షన్ గేమ్సేనా ?
ప్రజల్లో ఎవరి ప్రచారం బలంగా ఉంటే అదే నిజమనే స్థాయికి ప్రస్తుత పరిస్థితులు చేరాయి. ఒక స్కామ్‌ను కప్పిపుచ్చడానికి మరొక స్కామ్‌ను తెరపైకి తెస్తూ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని సామాన్య ప్రజలు భావిస్తున్నారు. కాళేశ్వరం విచారణలో జాప్యం, సింగరేణిపై కొత్త ఆరోపణలు వెరసి.. తెలంగాణ రాజకీయం కేవలం విచారణల చుట్టూ తిరిగే ఓ పొలిటికల్ డ్రామా గా కనిపిస్తోంది. నిజంగా అవినీతిని అంతం చేయాలనే చిత్తశుద్ధి ఏ పార్టీకి ఉందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
