నేను ఎదురొచ్చినా నీకే నష్టం.. నీవు ఎదురొచ్చినా నీకే నష్టం అని ఓ సినిమాలో హీరో డైలాగ్ చెబుతారు. రాజకీయాల్లో ఈ డైలాగ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది.ఆయనతో పెట్టుకుని ఆయనకు ఎదురెళ్లిన వారంతా .. ఆయన చేతిలో ఓడిపోతున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనకే మేలు చేసేలా వారు రాజకీయాలు చేయడంలో రేవంత్ రెడ్డి తనదైన వ్యూహం అవలంభిస్తారు. ఓ సాధారణ యువకుడిగా.. కార్యకర్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా కొద్ది కాలంలోనే సీఎం స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు. దాన్ని సాధించారు రేవంత్ రెడ్డి.
ప్రతిపక్షంగా రాజకీయాలు చేయడం వేరు.. పాలకుడిగా రాజకీయాలు చేయడం వేరు. నేరుగా సీఎం అయ్యే ముందు మంత్రిగా కాదు కదా కనీసం అధికార పార్టీలో కూడా లేని రేవంత్ రెడ్డి.. ప్రతిపక్ష నేత హోదా నుంచి పాలకుడిగా తన ప్రయాణాన్ని మార్చుకోవడంలో కొంత వరకూ తడబడ్డారు కానీ.. చాలా వరకూ అద్భుతమైన పరిణితి చూపించారు. సాధారణం అధికారం వస్తే పగలు, ప్రతీకారాలు తీర్చుకోవాలనుకుంటారు. కానీ రాజకీయాలను సంపూర్ణంగా అర్థం చేసుకున్న ఆయన వాటి జోలికి పోలేదు.
అయితే పాలన పరంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలు, దూకుడుగా తీసుకున్న నిర్ణయాలు, ఓ నిర్ణయం తీసుకునే ముందు ప్రజల్లో పరోక్షంగా అయినా చర్చకు పెట్టాల్సిన వ్యూహాలు, తీసుకోబోయే నిర్ణయాలపై ప్రజల్ని మెంటల్‌గా ప్రిపేర్ చేసే పద్దతులు సరిగ్గా పాటించకపోవడం వల్ల ఆయన కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాలకుడిగా చేయాలనుకున్న పనిని దూకుడుగా చేస్తే సరిపోదు. ఆ పనుల్ని ప్రజల్లోకి నెగెటివ్‌గా పంపుతాయి విపక్ష పార్టీలు.అది వారి పని. కానీ వారికి అలాంటి అవకాశం ఇవ్వకుండా చేసుకోవడంలోనే వ్యూహం ఉంటుంది. ఇలాంటి విషయాల్లో సీఎం రేవంత్ ఇంకా మెరుగుపడాల్సి ఉందని ఎక్కువ మంది అభిప్రాయం.
సీఎంగా రెండేళ్లు త్వరలో పూర్తి చేసుకోబోతున్న రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఏటికి ఎదురీదుతూ ముందుకు వచ్చారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత రాజకీయాలతో ఎదురీదుతూనే తన ప్రయాణం సాగిస్తున్నారు. అది ఆయనకు అలవాటయిన ప్రయాణం.. ఎప్పుడూ విజయాలే సాధిస్తున్నారు. నేటి రాజకీయాల్లో కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి లాంటి చురుకైన, వ్యూహాలు తెలిసిన లీడర్ దాదాపుగా ఎవరూ లేరు. ఆయన రాజకీయ పయనం సుదీర్ఘంగా ఉండబోతోంది. ..హ్యాపీ బర్త్ డే సీఎం రేవంత్ గారు!
