తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల పంచాయతీ ఖర్గే ముందూ నడిచింది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయనను ఆశావహులంతా హోటల్లో కలిశారు. తమ వాదనలు వినిపించారు. మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనని గట్టిగా చెప్పారు. ఎందుకు ఇవ్వాలో కూడా చెప్పారు. అయితే ఖర్గే మాత్రం చాలా మందికి నేరుగానే మంత్రి పదవులు ఇవ్వలేమని వేరే పదవులు తీసుకోవాలని సూచించినట్లుగా చెబుతున్నారు.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు .. ఖర్గే తీరుపై అసంతృప్తితో వెళ్లిపోయారు. ఆయనను ఆపి..బుజ్జగించేందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చాలా ప్రయత్నాలు చేశారు. రెండు సార్లు పార్టీ నుంచి వెళ్లిపోయి మళ్లీ వచ్చిన వివేక్ కుటుంబానికి మూడు, నాలుగు పదవులు ఇచ్చి.. పార్టీని వీడకుండా కష్టపడిన తనకు అన్యాయం చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. మంత్రి పదవి కష్టమని.. చీఫ్ విప్ పదవి తీసుకోవాలని ప్రేమ్ సాగర్ రావును ఖర్గే కోరారు. కానీ ప్రేమ్ సాగర్ తిరస్కరించారు. రెడ్డి వర్గానికి ఇక మంత్రి పదవులు ఉండబోవని మల్రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి వంటి వారికి ఖర్గే చెప్పారు. అయితే జిల్లాల ప్రతిపదిక తీసుకోవాలని.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి లేరని.. గ్రేటర్ పరిధిలో మంత్రి లేరని వీరు గుర్తు చేశారు. ఆది శ్రీనివాస్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసలు ఖర్గేతో సమావేశం అయ్యేందుకు రాలేదు.
కాంగ్రెస్ సీనియర్లు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ మంత్రి పదవులు రావన్నంతగా కంగారు పడుతున్నారు. తమకు పదవులు ఇవ్వాలని ఎవరికి వారు పోటీ పడుతున్నారు. పార్టీ గెలుపు కోసం ప్రయత్నించామని వారు పదే పదే హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. మంత్రివర్గంలో ఇంకా మూడు ఖాళీలు ఉన్నాయి. ఇద్దరు, ముగ్గురు వివాదాస్పద మంత్రుల్ని తొలగించి కొత్త వారితో భర్తీ చేస్తారని.. తమకు అవకాశం లభిస్తుందని ఎక్కువ మంది ఒత్తిడి పెంచుతున్నారు. ఇది కాంగ్రెస్ లో సమస్యలు సృష్టిస్తోంది.