లోక్ స‌భ ఎన్నిక‌ల్లో టి. కాంగ్రెస్ ప్రచార వ్యూహం ఇదేనా..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఓట‌మి పాలై డీలాప‌డ్డ సంగ‌తి తెలిసిందే. అయితే, రాబోయే లోక్ స‌భ ఎన్నికల్లో మ‌రింత ఉత్సాహంతో పోరాటం చేసేందుకు పార్టీని సిద్ధం చేసే ప‌నిలోప‌డ్డారు టి. నేత‌లు. గ‌డ‌చిన రెండ్రోజులుగా పార్టీ ప్ర‌ముఖ నేత‌లంతా హైద‌రాబాద్ లోని ఒక హోట‌ల్లో మీటింగులు పెట్టుకుని, ప్ర‌చార వ్యూహంపై క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఆదివారం కూడా ఆ చ‌ర్చ కొన‌సాగ‌నుంది. ఈ చ‌ర్చ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల వైఫ‌ల్యానికి కార‌ణ‌మైన ప్ర‌చారాంశాల‌పై విశ్లేషించిన‌ట్టుగా తెలుస్తోంది. స్థానిక స‌మ‌స్య‌ల‌ను పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసినా ఉప‌యోగం లేక‌పోయింద‌నీ, తెలుగుదేశంతో పొత్తు కూడా లాభించ‌లేద‌న్న అంశం మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ‌లో లోక్ స‌భ ఎన్నిక‌ల్ని తెరాస కాంగ్రెస్ ల మ‌ధ్య జ‌రుగుతున్నాయ‌న్న త‌ర‌హా ప్ర‌చారం ఉండ‌కూడ‌ద‌ని టి. నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్న‌ట్టుగా తెలుస్తోంది.

కేసీఆర్ మీద విమ‌ర్శ‌లు చేయ‌డం వ‌ల్ల లోక్ స‌భ ఎన్నిక‌ల్లో లాభం ఉండ‌ద‌నేది వారి అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే, ఈసారి మోడీ వెర్సెస్ రాహుల్ అనే అజెండాతోనే తెలంగాణ‌లో ప్ర‌చారం చేయాలనే అభిప్రాయం నేత‌ల మ‌ధ్య వ్య‌క్త‌మౌతున్న‌ట్టుగా తెలుస్తోంది. మోడీ స‌ర్కారు వైఫ‌ల్యాల‌పైనే ఫోక‌స్ పెట్టాల‌నీ, కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప్ర‌క‌టించిన క‌నీస ఆదాయ భరోసా హామీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఎన్నిక‌ల నోటిఫికేషన్ వ‌చ్చిన వెంట‌నే… ఎంపీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేందుకు అవ‌స‌ర‌మైన క‌స‌ర‌త్తు కూడా జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌లో జ‌రిగిన జాప్య‌మే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మికి ఒక కార‌ణంగా క‌నిపిస్తున్న నేప‌థ్యంలో… ఈసారి ఆ పొర‌పాటును పునరావృతం చేయ‌కూడ‌ద‌ని భావిస్తున్నారు.

అయితే, కేసీఆర్ ని విమ‌ర్శించ‌కుండా కాంగ్రెస్ ప్ర‌చారం చేసినా… తెరాస ఎంపీ అభ్య‌ర్థులు కాంగ్రెస్ పై దాడి చేస్తూనే ప్ర‌చారంలోకి దిగుతారు! రాహుల్ వెర్సెస్ మోడీ అని టి. నేత‌లు ఎంత ప్ర‌చారం చేసినా… తెరాస అభ్య‌ర్థులు స్థానిక అంశాల‌నే ప్ర‌ధానంగా చూపిస్తారు. అన్ని ఎంపీ స్థానాల్లో తెరాస అభ్య‌ర్థుల్ని గెలిపిస్తే… ఢిల్లీలో మ‌నం ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తామంటూ సీఎం కేసీఆర్ పిలుపునిస్తారు. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కూడా సెంటిమెంట్ ప్ర‌యోగానికి తెరాస సిద్ధంగా ఉంటుంద‌ని మ‌ర‌చిపోకూడ‌దు. కాబ‌ట్టి, తెరాస విమ‌ర్శ‌ల‌కు బ‌దులివ్వ‌కుండా… మోడీని టార్గెట్ చేస్తూ ప్ర‌చారం చేయ‌డం స‌రైన వ్యూహంగా క‌నిపించ‌డం లేదు. తెరాస‌, భాజ‌పా తానులో ముక్క‌ అని ప్ర‌చారం చేయ‌డం స‌రైన వ్యూహం అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com