తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన రాష్ట్రాన్ని 2047 నాటికి ఎలా చూడాలనుకుంటున్నారో ప్రజల ముందు ఆవిష్కరించారు. తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ ను విడుదల చేశారు. తెలంగాణ మూడు పెద్ద ఆర్థిక జోన్లుగా విభజించి, ప్రతి జోన్‌కు ప్రత్యేక లక్ష్యం కేటాయించే అతి పెద్ద దీర్ఘకాలిక ప్రణాళికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం ఆవిష్కరించారు. తెలంగాణ రైజింగ్: విజన్-2047 ఈ డాక్యుమెంట్‌ను సీఎం అద్భుత పాలసీగా చెప్పుకున్నారు. 2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటాను 5 శాతం నుంచి 10 శాతానికి పెంచే లక్ష్యాన్ని ప్రకటించారు.
ISB, నీతి ఆయోగ్ సలహాలతో విజన్ డాక్యుమెంట్
గతంలో పాలసీలు మారితే ఇన్వెస్టర్లు భయపడ్డారు. ఇకపై అలా జరగదని రేంత్ హామీ ఇచ్చారు. ఈ విజన్ డాక్యుమెంట్‌కు లక్షలాది మంది ప్రజలు, ISB నీతి ఆయోగ్ వంటి సంస్థలు సలహాలిచ్చాయి. ఇది పారదర్శకంగా, స్థిరంగా అమలయ్యే పాలసీ అవుతుందన్నారు. తెలంగాణను మూడు జోన్లుగా విభజించారు.
1. క్యూర్ – కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ
ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపలి హైదరాబాద్ మహానగరం క్యూర్ ఎకానమీ కిందకు వస్తుంది. కాలుష్యం లేని నెట్-జీరో సర్వీస్ సెక్టార్ హబ్‌గా ఈ ప్రాంతాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మూసీ నది పునరుజ్జీవం, మెట్రో విస్తరణ, కాలుష్య కర్మాగారాలను బయటికి తరలించడం వంటి ప్రాజెక్టులు చేపడతారు. ఇక్కడ ఉద్యోగాలు, విద్య, వైద్యం అన్నీ అందుబాటులో ఉంటాయి.. కానీ కాలుష్యం జీరో అని రేవంత్ ప్రకటించారు.
2. ప్యూర్ – పెరి అర్బన్ రీజనల్ ఎకానమీ
ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య బెల్ట్‌ను ప్యూన్ అని పిలుస్తున్నారు. రాష్ట్రాన్ని వేగంగా అనుసంధానం చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెల్ట్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ, కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలు, బుల్లెట్ ట్రైన్, వరంగల్-అదిలాబాద్-భద్రాద్రి కొత్తగూడెం-రామగుండం విమానాశ్రయాలు, పోర్ట్ కనెక్టివిటీ వంటి ప్రాజెక్టులను ప్రతి చేస్తారు. తెలంగాణ భవిష్యత్‌కు ఇదే హార్ట్‌గా రేవంత్ భావిస్తున్నారు.
రేర్ – రూరల్ అగ్రికల్చర్ రిజనల్ ఎకానమీ
రీజనల్ రింగ్ రోడ్ బయట నుంచి రాష్ట్ర సరిహద్దు వరకు గ్రామీణ తెలంగాణ వరకూ రేర్ కిందకు వస్తుంది. రైతులను అభివృద్ధిలో భాగస్వాములుగా మార్చి, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వృద్ధిని లక్ష్యంగా చేసుకున్నారు. విత్తన ఉత్పత్తి కేంద్రంగా మార్చడం, ఆహార భద్రత, గ్రామీణ ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించారు. పట్టణం-గ్రామం అంతరం తొలగించి, రైతుకూ ఎక్కువ ఆదాయం సాధించడాన్ని టార్గెట్‌గా పెట్టుకుంటారు.
2034 నాటికి – $1 ట్రిలియన్ ఎకానమీ , 2047 నాటికి – $3 ట్రిలియన్ ఎకానమీ .. దేశ GDPలో తెలంగాణ వాటా 10 శాతం ఉండాలన్నది రేవంత్ లక్ష్యం. ఈ మూడు జోన్లూ ఒకేసారి ఎదిగితేనే ఈ లక్ష్యాలు సాధ్యం. ఒక్కటైనా వెనకబడితే మొత్తం రాష్ట్రం వెనకబడుతుందని అని సీఎం అన్నారు. అందుకే దారి తప్పకుండా.. తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామన్నారు. ఇలాంటి విజన్ ఉండటం అత్యవసరం. రేవంత్ సరైన దారిలో ఉన్నారు. ప్రకటించడం కన్నా ఆచరించడమే క్లిష్టం. చేసి చూపించాల్సింది కూడా రేవంత్ ప్రభుత్వమే.
