పాలనా వ్యవహారాలపైనే దృష్టి పెట్టి పార్టీని నిర్లక్ష్యం చేయకుండా.. చంద్రబాబు,లోకేష్ ఇద్దరూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా కాకుండా గ్రామ స్థాయిలోనూ ఏం జరుగుతుందో స్పష్టమైన సమాచారం తెప్పించుకుంటున్నారు. దానికి అనుగుమంగా చర్యలు తీసుకుంటున్నారు. తప్పు చేసిన పార్టీ నేతలకు నేరుగానే హెచ్చరికలు పంపుతున్నారు. కొంత మంది ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత తగ్గడం పార్టీ నేతలు స్పష్టంగానే కనిపిస్తోంది.
జిల్లాల పర్యటనల్లో పార్టీ నేతలతో సమావేశాలు
అధికారిక పర్యటనల కోసం జిల్లాలకు వెళ్తున్న చంద్రబాబు అక్కడ పార్టీ నేతలతో సమావేశం కోసం సమయం కేటాయిస్తున్నారు. పూర్తి సతాయింపు సమాచారంతో నేతల వ్యవహారాలపై నిలదీస్తున్నారు. పార్టీ కోసం కష్టపడేవారిని అభినందిస్తున్నారు. అదే సమయంలో అధికార పార్టీ అన్న కారణంగా వివాదాలు సృష్టించే వారిని.. ప్రజలపై పెత్తనం చెలాయించాలనుకునే వారిని మాత్రం వదిలి పెట్టడం లేదు. హెచ్చరిస్తూనే ఉన్నారు. మారకపోతే మార్చేస్తానని కూడా అంటున్నారు. దీంతో ఆయా పార్టీల నేతలు షాక్ తింటున్నారు. తప్పులు చేస్తున్న వారిపై గతంలో చంద్రబాబు మాట్లాడే తీరుకు.. ఇప్పుడు మాట్లాడుతున్న తీరుకు చాలా తేడా కనిపిస్తోందని పార్టీ నేతలు కూడా అంటున్నారు.
నారా లోకేష్ డైరక్ట్ యాక్షన్
ఇక చంద్రబాబు హెచ్చరికల తర్వాత నారా లోకేష్ రంగంలోకి దిగుతున్నారు. నేతల పనితీరును మానిటరింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా పదవులు తీసుకుని .. దుర్వినియోగం చేస్తున్న వారిపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ప్రతి వారం గ్రీవెన్స్ నిర్వహించడం, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేకపోవడం వంటి విషయాలను సీరియస్ గా తీసుకుంటున్నారు. పార్టీ వ్యవహారాలను మాత్రమే కాదు.. ప్రజలతో కనెక్ట్ అయ్యే ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో నిర్లక్ష్యం చేసే వారిని వదిలి పెట్టడం లేదు. ఇద్దరు మంత్రుల్ని కూడా లోకేష్ గట్టిగానే హెచ్చరించారు. ఇలాంటి హెచ్చరికలు.. ప్రాథమిక స్థాయిలో ఉండి మార్చుకుంటే సరే..లోకేష్..లేకపోతే ఎలాంటి పరిణామాలు వస్తాయో వారికే తెలిసొచ్చేలా చేస్తున్నారు.
ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్యేలకు తగ్గిన ప్రాధాన్యం
కొంత మంది ఎమ్మెల్యేలు దారి తప్పుతున్నారని హెచ్చరికలు జారీ చేశారు. కొంత మంది సర్దుకున్నారు.కానీ కొంత మంది ఆ.. ఏమవుతుందిలే అని తమ దారిన తాము పోతున్నారు. అలాంటి వారికి ప్రాధాన్యం తగ్గిపోతోంది. కొలికపూడి లాంటి వారిని దాదాపుగా పట్టించుకోవడం మానేశారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు.. తమకు ప్రోటోకాల్ దక్కడం లేదని.. అధికారులు పట్టించుకోవడంలేదని అంటున్నారు. అలాంటి వారు ఈ పరిస్థితి ఎందుకు వస్తుందో కాస్త ఆలోచిస్తే.. తెలుస్తుంది. ఓ సారి అధినాయకత్వం నమ్మకం కోల్పోయిన తర్వాత .. మళ్లీ మళ్లీ సంపాదించుకోవడం దాదాపుగా అసాధ్యం. కొత్త ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకోవడం మంచిదన్న సలహాలు సీనియర్ నేతల నుంచి వస్తున్నాయి.
