తెలంగాణలో సంచలనం సృష్టించిన పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై న్యాయపరమైన ఉత్కంఠకు తెరపడింది. సుప్రీంకోర్టు కేసును క్లోజ్ చేసింది. స్పీకర్ నిర్ణయం తీసుకోలేదన్నదానిపైనే బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. ఇప్పుడు స్పీకర్ నిర్ణయం ప్రకటించేశారు. ఈ కేసులో తక్షణమే ఎవరిపై అనర్హతా వేటు పడకపోయినప్పటికీ, భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేలా ఒక బలమైన బెంచ్ మార్క్ ఈ పిటిషన్లతో ఏర్పడింది.
స్పీకర్లు తమ విచక్షణాధికారం పేరుతో అనర్హతా పిటిషన్లను ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంచే సంస్కృతికి ఈ తీర్పుతో అడ్డుకట్ట పడినట్లయింది. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో న్యాయస్థానాల జోక్యం ఎంత అవసరమో ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో స్పీకర్లు తమకు ఉన్న అధికారాలను అస్త్రంగా చేసుకుని కాలయాపన చేసేవారు. ఫలితంగా ఫిరాయించిన వారు ఐదేళ్ల పదవీకాలాన్ని నిశ్చింతగా పూర్తి చేసుకునే అవకాశం ఉండేది.
తాజా పరిణామాల ప్రకారం స్పీకర్ల విచక్షణాధికారం అనేది రాజ్యాంగ బద్ధమైన బాధ్యతే తప్ప, నిర్ణయాన్ని వాయిదా వేసే హక్కు కాదని తేలిపోయింది. సుప్రీంకోర్టు గతంలో నిర్దేశించిన గడువు లోపే ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిణామం కేవలం ఒక రాష్ట్రానికో లేదా ఒక పార్టీకో పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఒక ఉదాహరణగా నిలవనుంది.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 10వ షెడ్యూల్ అసలు ఉద్దేశం నెరవేరాలంటే, నిర్ణీత కాలపరిమితిలో తీర్పులు రావడం అనివార్యమని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ కేసు ముగింపు రాజకీయ నాయకులకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. కానీ స్పీకర్ నిర్ణయం మాత్రమే.. అనేక రకాల చర్చలకు కారణం అవుతోంది.


