తెలంగాణ ధనిక రాష్ట్రమని సీఎం కేసీఆర్ అడిగిన వారికీ.. అడగని వారికీ చెబుతూంటారు. కానీ ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై అనేక మందికి సందేహాలు వస్తున్నాయి. జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. జిల్లాల వారీగా ఇరవయ్యో తేదీ వరకూ జీతాలు సర్దుబాటు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో.. అసలు తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏమిటో ఎవరికీ స్పష్టంగా తెలియడం లేదు. కాంట్రాక్టర్ల బిల్లులు, పంయతీల్లో నిధులు కూడా పెండింగ్‌లో పడిపోయాయి. గత ఆర్థిక సంవత్సానికి చెందిన పలు రకాల ఉద్యోగుల బిల్లులు ఇంత వరకూ క్లియర్ కాలేదు.
తెలంగాణ ప్రభుత్వం రుణాలు తీసుకుని చెల్లించడం లేదంటూ కొన్ని బ్యాంకులు గవర్నర్లకు ఫిర్యాదు చేస్తున్నాయి.తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలు జారీ చేసిన పవర్ బాండ్ల గడువు ముగిసినప్పటికీ చెల్లింపులు చేయడం లేదని యాక్సిస్ బ్యాంక్ గవర్నర్లకు ఫిర్యాదు చేశాయి. 2021 సెప్టెంబర్ 9 నాటికి ఏపీ, తెలంగాణ ట్రాన్స్‌కోలు రూ.156.70 కోట్లు చెల్లించాల్సి ఉందని లేఖలో తెలిపింది. ఎన్ని సార్లు అడిగినా ఇవ్వడం లేదని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ఇలాంటివి బయటకు వచ్చినవే. బయటకు రానివి చాలా ఉంటాయని చెబుతున్నారు.
తెలంగాణ సర్కార్ ఇటీవలి కాలంలో రైతు బంధు వంటి పథకాల కోసం నిధులు కేటాయించింది. ఈ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటోదని మామూలుగా అయితే తెలంగాణ ఆదాయానికి ఢోకా లేదని చెబుతున్నారు. అయితే ఇలా జీతాలు.. ఇతర అత్యవసరాల ఖర్చులకు కూడా లేనంతగా ఎందుకు ఇబ్బంది పడుతుందనేది ఆర్థిక నిపుణులకు కూడా అంతుబట్టని విషయం. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తేనే క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఏపీలో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి కానీ తెలంగాణ విషయంలో మాత్రం గోప్యంగానే ఉంటున్నాయని చెబుతున్నారు.