ఇప్పటి అవార్డులు కూడా కమర్షియల్ అయిపోయాయి. పెద్ద సినిమాలకే అవార్డులు కట్టబెడుతున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న గద్దర్ అవార్డుల కార్యక్రమం మాత్రం తన ప్రత్యేక పంథా చూపిస్తోంది. గతేడాది చిన్న సినిమాలకు పెద్ద పీట వేసింది ప్రభుత్వం. ఈసారి కూడా అదే జరిగింది. 2025 సంవత్సరానికి గానూ గద్దర్ అవార్డుల్ని ఈరోజు ప్రకటించారు. ఈసారి కూడా చిన్న సినిమాలకే సింహభాగం అవార్డులు కైవసం చేసుకొన్నాయి. ముఖ్యంగా తెలంగాణ జీవితాన్ని, ఇక్కడి సంస్కృతుల్ని ప్రతిబింబించే సినిమాలకు అగ్ర తాంబూలం అందించింది.
రాజు వెడ్స్ రాంబాయి, దండోరా, ప్రీ వెడ్డింగ్ షో, కోర్ట్, లిటిల్ హార్ట్స్ చిత్రాలు ఎక్కువ అవార్డుల్ని దక్కించుకొన్నాయి. ఉగాది సందర్భంగా ఈ అవార్డుల్ని ప్రదానం చేస్తారు. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చాక పెండింగ్ లో ఉన్న పాత అవార్డుల్ని ఒక్కసారిగా క్లియర్ చేసిన సంగతి తెలిసిందే. 2025 సంవత్సరానికి సంబంధించిన అవార్డుల్ని సైతం.. మార్చిలోగా అచ్చేయడం ఆహ్వానించదగిన పరిణామం. అవార్డు కార్యక్రమాన్ని సైతం ఆర్భాటంగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతేడాది అట్టహాసంగా అవార్డు కార్యక్రమం నిర్వహించారు. అయితే అవార్డు గ్రహీతలు కొంతమంది ఈ కార్యక్రమానికి రాలేదు. దాంతో రానివాళ్లపై ప్రభుత్వ పెద్దలు ఫైర్ అయ్యారు. దిల్ రాజు సైతం ప్రెస్ మీట్ పెట్టి `అవార్డు ఇచ్చినా తీసుకోవడానికి టైమ్ లేదా` అంటూ ఆవేదన వెళ్లగక్కారు. ఈసారి మాత్రం 100 శాతం అంటెండెన్స్ ఉండాలని ప్రయత్నిస్తున్నారు.


