71వ జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ మరోసారి తన సత్తా చాటుకుంది. తెలుగు పరిశ్రమకు ఏడు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ గౌరవాన్ని అందుకున్న సినీ ప్రముఖులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సత్కరించడం పరిశ్రమలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఈ రోజు సీఎం క్యాంప్‌ఆఫీస్‌లో సినీ వాతావరణం నెలకొంది. ‘భగవంత్ కేసరి’ దర్శకుడు అనిల్ రావిపూడి, ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ‘బేబీ’ ఫేమ్ సాయి రాజేశ్ తదితర జాతీయ అవార్డు విజేతలు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆ అవార్డు గ్రహీతలకు శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు.
సినిమా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా చర్చ సాగింది. దర్శకులు, సాంకేతిక నిపుణులు తమ సమస్యలను నేరుగా సీఎంకు వివరించగా, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. “హైదరాబాద్‌ను సినిమా నిర్మాణానికి ప్రధాన కేంద్రంగా మరింత అభివృద్ధి చేస్తాం. పరిశ్రమకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తాం” అని ఆయన భరోసా ఇవ్వడం, అక్కడున్న వారిలో ఆనందం నింపింది.
సీఎం రేవంత్ రెడ్డి సినీ రంగాన్ని తొలినుంచే ఆదరిస్తూ వస్తున్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన ‘గద్దర్ అవార్డ్స్’ ద్వారా సినీ కళాకారులను విశేషంగా గౌరవించారు. నిజానికి రాష్ట్ర విభజన తర్వాత అసలు సినీ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి గుర్తింపే లేకుండాపోయింది. అలాంటిది రేవంత్ సర్కార్ మళ్లీ సినీ కళాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ అవార్డు వేడుక ఘనంగా నిర్వహించారు.
అలాగే ప్రతి కళాకారుడిని కలుసుకునేలా, వారి సాధకబాధకాలు వినడానికి రేవంత్ ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. తాజాగా జరిగిన ఈ భేటీ కూడా ఆయనలోని ఆర్ట్ ఫ్రెండ్లీ దృక్పథాన్ని మరింత బలపరిచింది.
టాలీవుడ్ నుంచి జాతీయ స్థాయిలో ప్రతిష్టను అందుకున్న కళాకారులను నిజానికి పరిశ్రమ సత్కరించాలి. కానీ “పరిశ్రమలో ఎవరి కుంపటివారిదే” అని మొన్న నిర్మాత అల్లు అరవింద్ నిట్టూర్చారు. ఇలాంటి సమయంలో జాతీయ అవార్డు విజేతలను సీఎం రేవంత్ రెడ్డి సత్కరించడం ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది.