దేశంలో దిగ్గజ కంపెనీ లార్సన్ అండ్ టూబ్రోపై తెలంగాణ ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయించుకుంది. అయితే అది ఎల్ అండ్ టీ మెట్రో విషయంలో కాదు. మేడిగడ్డ అంశంలో. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ కుంగుబాటు నిర్మాణ సంస్థ ఎల అండ్ టీనే. బ్యారేజీ నిర్మాణంలో తీవ్ర లోపాలు ఉన్నాయని, ఆ వైఫల్యానికి పూర్తి బాధ్యత నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ దేనని నిర్ధారణకు వచ్చిన తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరణ చేసి ఇవ్వాలని కోరింది. దానికి ఎల అండ్ టీ అంగీకరించడం లేదు.
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన తర్వాత, దాని పునరుద్ధరణ బాధ్యతలను స్వీకరించాలని ప్రభుత్వం పలుమార్లు కోరినప్పటికీ నిర్మాణ సంస్థ నుంచి సరైన స్పందన రాలేదు. తమ తప్పేమీ లేదని వాదిస్తూ, మరమ్మతులకు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఇంతటి భారీ ప్రాజెక్టు నిరుపయోగంగా మారడానికి కారకులైన వారిని వదిలిపెట్టబోమని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. చట్టపరమైన చర్యల కోసం న్యాయశాఖ అభిప్రాయాన్ని కోరగా క్రిమినల్ కేసు పెట్టేందుకు కావాల్సిన ఆధారాలు ఉన్నాయని న్యాయశాఖ నివేదిక ఇచ్చింది.
డిజైన్ లోపాలు, నాణ్యత లేని నిర్మాణం వల్లనే బ్యారేజీ దెబ్బతిన్నదని కొన్ని నివేదికలు ఉన్నాయి. నిర్లక్ష్యమే కాకుండా, కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను నిర్మాణ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని జస్టిస్ ఘోష్ కమిషన్ సూచించింది. ఈ నివేదికల ఆధారంగానే ప్రభుత్వం ఇప్పుడు అడుగులు వేస్తోంది.
నేరుగా కేసు నమోదు చేయడానికంటే ముందు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యారేజీ వైఫల్యానికి మీపై ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కోరుతూ నోటీసులు పంపనున్నారు. ఆ వివరణ సంతృప్తికరంగా లేకపోతే తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు.


