స్టార్టప్స్ ను ప్రోత్సహించేందుకు నిర్మించిన టీహబ్ ప్రాంగణంలో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని తొలుత భావించిన ప్రభుత్వం, తీవ్ర విమర్శల కారమంగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. సీఎం రేవంత్..సీఎస్‌తో మాట్లాడి అలాంటి పనులు చేయవద్దని స్పష్టం చేసినట్లుప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు సమాచారం లేకుండా, రాజకీయ పర్యవసానాలను అంచనా వేయకుండా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ విధానాలపై కనీస అవగాహన లేకుండా క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు పాలన ఇంకా గాడిలో పడలేదనడానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. టీహబ్ వంటి ప్రతిష్టాత్మక కేంద్రం ప్రాముఖ్యతను గుర్తించకుండా, దానిని కేవలం భవన సముదాయంగా మాత్రమే పరిగణించడం ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ, రాజకీయంగా జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిందని చెప్పుకోవచ్చు.
ఇలాంటి విషయాల్లో తెలంగాణ సర్కార్ పెద్దలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కేవలం పొదుపు చర్యల పేరుతో సాంకేతిక ఎకోసిస్టమ్‌ను దెబ్బతీసే ప్రయత్నాలు కాకుండా, పాలనలో స్థిరత్వం, స్పష్టమైన విధానాలతో ముందుకు సాగాలని మేధావులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా సమన్వయ లోపాలను సరిదిద్దుకుని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది.