తెలంగాణ ప్రభుత్వం ఉపసర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మళ్లీ వెంటనే అలాంటిదేమీ లేదని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మధ్యలో ఏం జరిగిందంటే.. సర్పంచులు, ఉపసర్పంచుల మధ్య నలిగిపోయింది. చివరికి చేతులు కాలే పరిస్థితి వచ్చిందని తెలియడంతో వెంటనే ఉపసంహరించుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం రాజకీయంగా జరిగిపోయింది.
ఉపసర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు
గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లకే పూర్తి అధికారాలు ఉండాలని, ఉపసర్పంచ్‌లకు ఉన్న జాయింట్ చెక్ పవర్ ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఒక్క సారిగా హాట్ టాపిక్ అయింది. పంచాయతీ నిధుల వినియోగంలో సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్ సంతకం కూడా తప్పనిసరి అనే నిబంధన ఉండటం వల్ల సమస్యలు వస్తున్నాయని ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కాసేపటికే ఉపసర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు చేస్తున్నట్లు ఇచ్చిన పాత ఉత్తర్వులను ఉపసంహరించుకుంటూ, మళ్లీ పాత జాయింట్ చెక్ పవర్ కొనసాగిస్తున్నట్లు కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. అసలు ఈ గందరగోళం ఎందుకు జరిగిందనే దానిపై సచివాలయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
సర్పంచ్‌లకు మాత్రమే చెక్ పవర్ ఉండాలని బలమైన లాబీయింగ్
గ్రామీణ స్థాయిలో పాలనను సులభతరం చేయడానికి, సర్పంచ్‌లకు పట్టు పెంచడానికి ప్రభుత్వం తొలుత సర్పంచ్‌కే చెక్ పవర్ ఇవ్వాలనుకుంది. నిధుల వినియోగంలో సర్పంచ్, ఉపసర్పంచ్‌ల మధ్య అనేక గ్రామాల్లో విభేదాలు ఉన్నాయి. ఉపసర్పంచ్ సంతకం చేయకపోవడం వల్ల కొన్నిచోట్ల అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. దీనిని పరిష్కరించడానికి చెక్ పవర్ రద్దు చేయాలని భావించినా, అది రాజకీయంగా ఎదురుదెబ్బ తగులుతుందని ప్రభుత్వం భావించింది.
పదే పదే హడావుడి నిర్ణయాలతో అభాసుపాలు
ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే ముందు సరైన కసరత్తు చేయడం లేదని, ఐఏఎస్ అధికారుల మధ్య సమన్వయ లోపం వల్లే ఇలాంటి గందరగోళ ఉత్తర్వులు వస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలో ఒక కీలకమైన అధికారిక ఉత్తర్వు రావడం, మళ్లీ దానిని రద్దు చేయడం అనేది ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని అంటున్నారు. ప్రస్తుతానికి ఉపసర్పంచ్‌ల చెక్ పవర్ యథాతథంగా కొనసాగుతున్నప్పటికీ, ఈ గందరగోళం వల్ల స్థానిక సంస్థల ప్రతినిధులలో ప్రభుత్వం పట్ల ఒక రకమైన అభద్రతా భావం ఏర్పడింది.
