తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులకు మరోసారి షాక్ తగిలింది. మెరిట్ లిస్టు రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మెయిన్స్ పేపర్లను రీ వాల్యూయేషన్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. 2024లో జరిగిన మెయిన్స్ పరీక్ష ఫలితాలు మార్చి 2025లో విడుదలైన తర్వాత, తెలుగు మీడియం అభ్యర్థులు తమ మార్కులు తక్కువగా రావడానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులతో పోల్చితే తెలుగు మీడియం వారికి అన్యాయమైందని ఆరోపణలు చేశారు. హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు మెయిన్స్ మెరిట్ లిస్టు రద్దు చేసి.. మళ్లీ వాల్యూయేషన్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో గ్రూప్-1 పరీక్షలు 2011 తర్వాత 13 సంవత్సరాలకు మళ్లీ 2024లో నిర్వహించారు. 2022, 2023 నోటిఫికేషన్లు పేపర్ లీక్‌లు, అక్రమాల వల్ల రద్దయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఫిబ్రవరి 2024లో కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. 563 పోస్టుల కోసం 5.5 లక్షల మంది అప్లై చేశారు. జూన్ 9, 2024న ప్రిలిమ్స్ జరిగి, 31,382 మంది మెయిన్స్‌కు క్వాలిఫై అయ్యారు. మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 21-27 వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మెద్చల్ జిల్లాల్లో 46 సెంటర్లలో నిర్వహించారు. మార్చి 10, 2025న ఫలితాలు విడుదల చేశారు.
ఫలితాల తర్వాత అభ్యర్థులు మెయిన్స్‌కు 1:50 రేషియో పై, రిజర్వేషన్ల అమలు, మార్కుల విభజనపై ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు “ఫాక్ట్-బేస్డ్, అనలిటికల్ ఆన్సర్లు రాసినా తక్కువ మార్కులు వచ్చాయి” అని ఆరోపిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు మార్కులు ఎక్కువగా ఇచ్చారని, ఇది భాషా వివక్ష అని న్యాయపోరాటం ప్రారంభించారు. రీవాల్యుయేషన్ ఉత్తర్వులు తెచ్చుకున్నారు.