తెలంగాణలో ఐపీఎస్లు, ఐఏఎస్లు తమకు పోస్టింగుల కోసం కర్ణాటక వైపు చూస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం తర్వాత కొంత మంది కీలక అధికారుల బదిలీలు జరిగాయి. కొంత మందికి లభించిన పోస్టింగులు చూసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆశ్చర్యపోయారు. ఇలా ఎలా అనుకున్నారు. కానీ అసలు తెర వెనుక జరిగింది మాత్రం చాలా కొద్దిమందికే తెలుసన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ తరపున ఎవైనా పదవులు కావాలన్నా.. ఏమైనా పనులు జరగాలన్నా.. ఇక్కడ ప్రయత్నించి సాధ్యం కాకపోతే నేరుగా బెంగళూరు వెళ్లిపోతున్నారు. అక్కడ డీకే శివకుమార్ ను కలుస్తున్నారు. అక్కడినుంచి సిఫారసులు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ పనులు పూర్తి చేసుకుంటున్నారు. పోలీసు ఉన్నతాధికారుల నియామకాల్లోనూ డీకే శివకుమార్ పాత్ర కీలకంగా కనిపిస్తోందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. కర్ణాటక కు చెందిన తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి ఒకరు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ చెప్పినట్లుగా చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టినా ఇప్పుడు అత్యంత కీలకమైన పోస్టింగ్ లభించింది. అలాగే మరికొంతమంది పోస్టింగులు కూడా డీకే శివకుమార్ సిఫారసు ఆధారంగానే జరిగాయని అంటున్నారు.
అయితే ఇంకా అయిపోలేదని.. కిటుకు పట్టేసిన ఐపీఎస్ అధికారులు కొంత మంది ఇక్కడ కాంగ్రెస్ నేతల్ని నమ్ముకోవడం కన్నా.. బెంగళూరు వెళ్లి ఓ ప్రయత్నం చేసి వస్తే బెటర్ అని అనుకుంటున్నారు. ఇలాంటి ప్రయత్నాలు ఫలిస్తున్నాయని త్వరలోనే మరికొన్ని ఐపీఎస్ అధికారుల బదిలీలు ఉండవచ్చని చెబుతున్నారు. డీకే శివకుమార్ మాటల్ని రేవంత్ కాదనలేరని .. కొన్ని విషయాల్లో పట్టించుకోకపోయినా చాలా విషయాల్లో ఆయన సిఫారసులను ఆమోదిస్తారని అంటున్నారు.