తెలంగాణలో రాజకీయ అధికారాలను చేపట్టాలని అనుకుంటున్న గ్రామ స్థాయి నాయకులకు అత్యంత గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. కోర్టులో కేసు ఉన్నప్పటికీ ఎన్నికలు నిర్వహించేయడానికి ఎస్ఈసీ సిద్ధం అయింది. గురువారం మధ్యాహ్నం కోర్టులో రిజర్వేషన్ల జీవోపై విచారణ జరగనుంది.అంతకంటే ముందే ఉదయం పదిన్నర నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇలా ప్రారంభం కాగానే అలా నామినేషన్లు వేయాలని కాంగ్రెస్ పార్టీ తన నేతలకు సూచించింది. ఇలా భయంభయంగా ఎందుకు నామినేషన్లు వేయాలని..తర్వాత చెల్లకపోతే పరిస్థితి ఏమిటన్న గందరగోళం పార్టీల్లో ఉంది.
ఎన్నికల చెల్లుబాటుపై సందేహాలు
సాధారణంగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ వస్తే రాజకీయ పార్టీల్లో ఓ రకమైన అటెన్షన్ కనిపిస్తుంది. అందరూ అలర్ట్ అయిపోతారు. ఎందుకంటే పార్టీ గ్రామ స్థాయిలో బలపడాలంటే.. పంచాయతీ, పరిషత్ ఎన్నికలే కీలకం. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ఎన్నికలను చాలా వరకూ వివాదాల్లోకి నెట్టేసింది. కోర్టు కేసుల్లో పెట్టేసి ఎన్నికలు నిర్వహిస్తోంది. జరిగేది పంచాయతీ, పరిషత్ ఎన్నికలే అయినా ఆ స్థాయి నేతలు .. తమ శక్తికి మించి ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ ఎన్నికలు రద్దు అయితే తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన వారిలో ఉంటుంది.
చెల్లకపోవచ్చని ఎక్కువ మంది నేతల నమ్మకం
ఇతర పార్టీల్లోనూ ఈ ఎన్నికలు కొనసాగుతాయన్న నమ్మకం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్గానిక్ గా ఎన్నికలు నిర్వహించాలని అనుకోవడం లేదు. బీసీ రిజర్వేషన్లకు హామీ ఇచ్చాం కాబట్టి ఎలాగోలా … జీవోలు ఇచ్చేసి..ఎన్నికలు కానిచ్చేద్దాం అనుకుంటున్నారు కానీ.. అవి కోర్టు కేసుల్లో పడితే ఇబ్బందులు వస్తాయని అనుకోవడం లేదు. అలాంటిది ఏదైనా జరిగితే ఇతర పార్టీల మీద నెట్టేయవచ్చు అనుకుంటున్నారు. అది రాజకీయమే .. అలాంటి రాజకీయం వల్ల మైనస్సే కానీ పార్టీకి ఎలాంటి ఉపయోగడం ఉండదు.
రేవంత్ రిస్క్ తీసుకుంటున్నారా ?
రాజ్యాంగాన్ని సవరించుకండా రిజర్వేషన్లు ఇవ్వలేమని.. మోదీని దింపేసి రాహుల్ ను ప్రధానిని చేసి రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ కూడా ప్రకటించారు. అవి అసాధ్యమని తెలిసినప్పుడు ఓ జీవో జారీ చేసి..కోర్టుల ద్వారా ఓకే చేయించుకోగలమని ఎలా అనుకున్నారో కానీ.. ఆ ప్రాసెస్ చెల్లుబాటు కాదని న్యాయనిపుణులు ఇప్పటికే చెబుతున్నారు. ఎన్నికలు జరిగినా .. చెల్లకుండా పోయే ప్రమాదం ఉందంటున్నారు. అందుకే ఈ ఎన్నికలు ఆర్గానిక్ కాదని.. నమ్మలేమని రాజకీయ పార్టీల క్యాడర్ కూడా ఓ నిర్ణయానికి వచ్చేశాయి.