రాజకీయ పార్టీల మధ్య పొలిటికల్ చెస్ సహజం. అదే రాజకీయం. కానీ ఇప్పుడు తెలంగాణలో మీడియా సంస్థలు కూడా నేరుగా రాజకీయం చేయడం ప్రారంభించాయి. రాజకీయ పార్టీల కన్నా మీడియా సంస్థల రాజకీయమే బహుముఖంగా సాగుతోంది. ఎవరు నిజం చెబుతున్నారో.. ఎవరు ఎదురుదాడి చేస్తున్నారో ఎంత మందికి తెలుసో కానీ.. మీడియా సంస్థలు మాత్రం రాజకీయ వ్యూహాల్లో తమను తాము భాగం చేసేసుకుని రాజకీయం ప్రారంభించాయి.
మీడియా, పాలిటిక్స్ చదరంగం !
ఇప్పుడు మీడియా రాజకీయానికి, రాజకీయ మీడియాకు మధ్య కోల్జ్ వార్ జరుగుతోంది. మీడియా రాజకీయం చేస్తోందని ఫలానా మీడియా సంస్థలపై ముద్ర వేయలేం. అలాగం రాజకీయ మీడియా అని కొన్ని చానళ్లపై ముద్ర వేయలేం. అన్ని మీడియాసంస్థలకూ అన్ని ట్యాగులూ ఇచ్చేలా రాజకీయ పార్టీల నేతలు తెరపైకివచ్చేశారు. బొగ్గు టెండర్ కోసమే కోమటిరెడ్డి పై నిందలేశారని ఆంధ్రజ్యోతి నిర్దారిస్తే … సీఎం రేవంత్ తో పాటు బట్టి విక్రమార్క మీడియా సంస్థల యజమానుల మధ్య ఏవో గొడవలు ఉంటే మీరు చూసుకోవాలని మా మీదకు రావొద్దని తోసేశారు. అంటే.. అది మీడియా రాజకీయం మాత్రమేనని వారు తేల్చేశారు. రాజకీయ పార్టీలతో సాన్నిహిత్యం గురించి పక్కన పెడితే మీడియా చానళ్ల యజమానుల మధ్య ఈగోలు బయటకు వచ్చి అసలు సంచలన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని సోషల్ మీడియాలో మరికొంత మంది ప్రచారం చేస్తున్నారు.
మీడియానే ఇరుక్కుపోయింది!
ఇక్కడ రాజకీయ నేతలు తెలివిగా వ్యవహరిస్తున్నారు. ప్రలోభాలకు లొంగిన వారో.. లేకపోతే సిద్ధాంతపరంగా మద్దతిస్తున్నవారో.. ఇతర పార్టీ అంటే ఇష్టం లేని వారో .. తమకు సానుకూలంగా ఉంటున్న మీడియాను వాడుకుంటున్నారు. అన్ని మీడియా సంస్థలను రాజకీయ పార్టీలు విభజించేశాయి. అది పింక్ మీడిాయ.. ఇది కాంగ్రెస్ మీడియా.. అనే ముద్ర వేసేసి.. అందులో వచ్చే వార్తలకు ఆ కలర్ అద్దేస్తున్నారు. పొలిటకల్ ట్రాప్ లో మీడియా చిక్కుకుంది. చానళ్ల యాజమాన్యాల మధ్య ఏమైనా పాత గొడవలు ఉన్నాయోమో ఎవరికీ తెలియదు కానీ అవన్నీ బయటకు రానున్నాయి. ఇంకా ముదిరితే వారి వ్యక్తిగత వ్యవహారాలు కూడా వెలుగులోకి వస్తాయి. గతంలో టీవీ5,ఎన్టీవీ యాజమానులు ఇద్దరి జాతకాలు బయట పెట్టుకోవడానికి చానళ్లలో ప్రోమోలు వేసుకున్నారు. కానీ చివరికి వెనక్కి తగ్గారు.
రాజకీయాలలో నేరుగా మీడియా భాగం
తెలంగాణలో మీడియా సంస్థల మధ్య ఈ విభేదాలు రాబోయే రోజుల్లో మరింత ముదిరేలా ఉన్నాయి. పార్టీలు తమ ఎజెండాను సెట్ చేయడానికి మీడియాను వాడుకోవాలని చూస్తున్నాయి. ఇది మీడియా ప్రైవేటు వ్యవహారాలను వెలుగులోకి తెస్తోంది. మీడియా యజమానుల పాత గొడవలు రాజకీయ రంగు పులుముకోవడంతో, రాష్ట్రంలో ఫోర్త్ ఎస్టేట్ ప్రతిష్టకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలు కేవలం రాజకీయ పార్టీలకే కాకుండా, మీడియాకు సవాలే. అందుకే మరింత మసాలా ఈ వివాదానికి త్వరలోనే కలిసే అవకాశం కనిపిస్తోంది.


