తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఊహించని వ్యూహంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ను ఊపిరాడనీయకుండా చేస్తోంది. ఒకవైపు వరుస కేసులు, విచారణలు, నోటీసులతో బీఆర్ఎస్ అగ్రనేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే, మరోవైపు మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన శ్రేణులను సిద్ధం చేసేసింది. గులాబీ దళం ఆత్మరక్షణలో పడి ఉన్న సమయంలోనే, హస్తం పార్టీ అగ్రనేతలు గ్రౌండ్ లెవల్లో అభ్యర్థుల ఎంపికను, వ్యూహరచనను సైలెంటుగా పూర్తి చేసుకుంటున్నారు.
నోటీసులను ఎదుర్కోవడానికి తీరిక లేని బీఆర్ఎస్
బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఒక పక్కా ట్రాప్ లోకి లాగేసినట్లు కనిపిస్తోంది. అగ్రనేతలంతా న్యాయపరమైన చిక్కులు, విచారణల నుంచి ఎలా బయటపడాలనే దానిపైనే దృష్టి పెట్టడంతో, పార్టీ క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని గాలికొదిలేశారు. దీనివల్ల కిందిస్థాయి నాయకులకు సరైన దిశానిర్దేశం కరువైంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో అత్యవసరమైన ఆర్థిక సాయం విషయంలో కూడా పార్టీ అగ్రనేతల నుంచి ఎలాంటి హామీ అందకపోవడం, కేడర్‌లో నైరాశ్యాన్ని నింపుతోంది. అంతా మీరే చూసుకోండి అని కిందిస్థాయి నేతలకు వదిలేయడం, పరోక్షంగా వారిని నిస్సహాయులను చేయడమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా వెలువడనుంది. ఫిబ్రవరి రెండో వారం నాటికే ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తయ్యేలా ప్రభుత్వం పావులు కదుపుతోంది. తీరా షెడ్యూల్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ మేల్కొన్నా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కాంగ్రెస్ అప్పటికే అభ్యర్థుల ఖరారు, ప్రచార పర్వంలో ముందుండగా, బీఆర్ఎస్ మాత్రం ఆఖరి నిమిషంలో అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. కేడర్‌ను సమన్వయం చేసుకునే సమయం కూడా వారికి చిక్కనివ్వకుండా కాంగ్రెస్ తన వ్యూహాన్ని అమలు చేస్తోంది.
బాధ్యతలు పంచుకుని సీరియస్‌గా తీసుకున్న సీనియర్ నేతలు
ఈ ఎన్నికల యుద్ధంలో కాంగ్రెస్ అగ్రనేతలు వార్డులు, కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపికలో కూడా వ్యక్తిగత ఆసక్తి చూపిస్తూ బాధ్యతలు పంచుకున్నారు. కానీ, బీఆర్ఎస్ అగ్రనేతలు మాత్రం కోర్టులు, నోటీసుల చుట్టూ తిరుగుతుండటంతో పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం లేకుండా పోయింది. తాము రాజకీయం కంటే కేసులకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చిందని, కాంగ్రెస్ తమను తెలివిగా బుక్ చేసిందని బీఆర్ఎస్ గ్రహించే లోపే ఎన్నికలు ముగిసిపోతాయి. శత్రువును యుద్దరంగంలో కాకుండా, ఆలోచనల్లోనే ఓడించాలి అన్నట్లుగా కాంగ్రెస్ వేసిన ఈ ఎత్తుగడ బీఆర్ఎస్ను కోలుకోలేని దెబ్బ తీసేలా ఉంది. ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న ఈ పరిణామాలు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష ఫలితాలకు దారితీసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.


