తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాక ముందే క్యాంప్ రాజకీయాల సెగ మొదలైంది. ఫలితాలు వెలువడక ముందే గెలుపుపై ధీమా ఉన్న అభ్యర్థులను, రెబల్స్ ను పక్కా ప్రణాళికతో రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నారు చైర్మన్, వైస్ చైర్మన్ ఆశావహులు. సాధారణంగా ఫలితాలు వచ్చిన తర్వాత గెలిచిన వారితో క్యాంపులు నిర్వహించడం చూస్తుంటాం. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఫలితాలు రాకముందే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఇతర ప్రాంతాలకు, రిసార్టులకు తరలిస్తున్నాయి.
కింగ్ మేకర్స్ ఎక్కువగా ఉంటారా?
గెలిచే అవకాశం ఉన్న వారిని ప్రత్యర్థి పార్టీల కంట పడకుండా కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ క్యాంపులు సాగుతున్నాయి. పార్టీ ఫిరాయింపులు, ప్రలోభాల భయంతో అభ్యర్థుల ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయించి మరీ ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఏకపక్ష తీర్పు వచ్చే సూచనలు తక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. చాలా వార్డుల్లో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ జరగగా.. కొన్ని చోట్ల స్వతంత్రులు బలమైన ప్రభావం చూపారు. ఓట్లు భారీగా చీలిపోవడంతో హంగ్ మున్సిపాలిటీలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాకపోతే, అప్పుడు స్వతంత్ర అభ్యర్థులు , చిన్న పార్టీల అభ్యర్థులు కింగ్ మేకర్లు గా మారే అవకాశం ఉంది.
చైర్మన్ పీఠాల కోసం రివర్స్ సర్కస్
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను దక్కించుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కోసం ఫలితాల తర్వాత అసలైన సర్కస్ మొదలుకానుంది. స్వతంత్రులను కలుపుకుని పీఠం దక్కించుకోవడానికి ఆయా పార్టీల ఆశావహులు ఇప్పటి నుంచే బేరసారాలు మొదలుపెట్టారు. ఇండిపెండెంట్లు ఏ వైపు మొగ్గు చూపుతారో అన్న ఉత్కంఠతో పాటు, వారిని ఆకర్షించేందుకు భారీ ఆఫర్లు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల గెలిచిన అభ్యర్థులు ఇంటికి వెళ్లకుండా నేరుగా రిసార్టులకే వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది.
కార్యకర్తల్లో ఆందోళన – నేతల్లో టెన్షన్
ఒకవైపు తాము గెలిపించుకున్న అభ్యర్థి కనిపిస్తాడో లేదో అని కార్యకర్తలు ఆందోళన చెందుతుంటే, గెలిచిన అభ్యర్థులు చేజారిపోతారేమో అని జిల్లా స్థాయి నేతలు టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా ఎక్స్ అఫీషియో ఓట్ల వినియోగం, ఫిరాయింపుల నిరోధక చట్టం వంటి సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని చైర్మన్ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానాలు కసరత్తు చేస్తున్నాయి. సాయంత్రం నుంచే ఈ సర్కస్ పీక్ స్టేజ్‌కు చేరుకోవచ్చు. పదహారో తేదీన చైర్మన్ ఎన్నికలు ముగిసే వరకూ ఎన్నో రాజకీయ విచిత్రాలు తెలంగాణలో జరగనున్నాయి.
