ఇప్పుడు టి.కాంగ్రెస్ పోరాటం మొద‌లైంద‌ట‌!

మియాపూర్ భూ కుంభ‌కోణం వ్య‌వ‌హారానికి తెరాస తెర దించేసింది! కానీ, ప్ర‌తిపక్షాలు ప‌ట్టుబిగించే ప్ర‌య‌త్నంలో ఉన్నాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని కాస్త సీరియ‌స్ గానే తీసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు మియాపూర్ ప్రాంతంలో ప‌ర్య‌టించారు. భూముల‌ను ప‌రిశీలించారు. స్థానికుల‌తో మాట్లాడి, డాక్యుమెంట్స్ చూశారు. అనంత‌రం మీడియాతో కాంగ్రెస్ నేత‌లు మాట్లాడారు. రూ. 15,000 కోట్ల భూకుంభ‌కోణం జ‌రిగితే ఏం ప‌ట్ట‌న‌ట్టుగా కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం దారుణం అంటూ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి విమ‌ర్శించారు. ఒక్క గ‌జం భూమి కూడా అన్యాక్రాంతం కాలేదంటూ సీఎం కేసీఆర్ ఎలా ప్ర‌క‌టించ‌గ‌లుగుతార‌ని ఆయ‌న నిల‌దీశారు. ఈ కుంభ‌కోణంలో కేసీఆర్ బంధువుల‌తోపాటు ఆత్మీయులూ కార్యాలయంలో ప‌నిచేసేవారికి కూడా సంబంధాలు ఉన్నాయ‌ని ఆరోపించారు. అందుకే, దీన్ని క‌ప్పిపుచ్చుకోవ‌డం కోస‌మే ఏం జ‌ర‌గ‌లేద‌ని కేసీఆర్ ప్ర‌క‌టించార‌ని అన్నారు.

ఆ త‌రువాత‌, జానారెడ్డి మాట్లాడుతూ… ఈ వ్య‌వ‌హారంపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌రిపించాల‌న్నారు. మియాపూర్ భూముల్లో డ‌బుల్ బెడ్ ఇళ్లు క‌ట్టించి పేద‌ల‌కు పంచాల‌ని ప్ర‌భుత్వానికి సూచించారు. ఈ వ్య‌వ‌హారంపై ముఖ్య‌మంత్రి స్పంద‌న హాస్యాస్పదంగా ఉంద‌ని మ‌రో నేత ష‌బ్బీర్ అలీ అన్నారు. మియాపూర్ భూకుంభకోణంపై సీబీసీఐడీ ద‌ర్యాప్తుకు ప్ర‌భుత్వం ఆదేశించింద‌ని తెలియ‌గానే తామంతా న‌వ్వుకున్నామ‌ని అన్నారు. అయినా, ఓ ప‌క్క ద‌ర్యాప్తు జ‌రుగుతూ ఉంద‌ని చెబుతూనే, మ‌రోప‌క్క ఇదే అంశంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మీక్ష చేయ‌డమేంట‌ని ఎద్దేవా చేశారు. ద‌ర్యాప్తు మ‌ధ్య‌స్థంలో ఉండ‌గా స‌మీక్ష ఎలా సాధ్య‌మైంద‌నీ, మియాపూర్ భూముల్లో కుంభకోణం లేనేలేద‌ని, ప్ర‌భుత్వం ధ‌నం ఒక్క రూపాయి కూడా పోలేద‌ని ముఖ్య‌మంత్రి ఎలా చెప్పార‌ని ష‌బ్బీర్ అలీ ప్ర‌శ్నించారు.

కాంగ్రెస్ నేత‌లు ఈ వ్య‌వ‌హారాన్ని ఇక్క‌డితో వ‌దిలేట్టు లేరు. మొత్తం వివ‌రాల‌న్నీ సేక‌రించి, కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధ‌మౌతున్నారు. ముందుగా గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ కు ఈ వ్య‌వ‌హారంపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌రిపించాలంటూ విన‌తి ప‌త్రం ఇవ్వ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఆ త‌రువాత‌, ప్ర‌ధానిని, రాష్ట్రప‌తిని క‌లుసుకుని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధ‌మౌతున్నారు. రాష్ట్రంలో కూడా ఇదే అంశాన్ని ప్ర‌ధానంగా చేసుకుని ఆందోళ‌న‌లు చేప‌ట్టేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్న‌ట్టు స‌మాచారం.

అయితే, తెలుగుదేశం కూడా ఈ అంశంపై పోరాడ‌తామ‌నే అంటున్నారు. గ‌వ‌ర్న‌ర్ కు వారూ ఓ విన‌తి ప‌త్రాన్ని ఇచ్చారు. ఇలా వేర్వేరుగా రెండు పార్టీలూ పోరాడేకంటే… క‌లిసి క‌దం తొక్కితే ప్ర‌భావ‌వంతంగా ఉంటుంది క‌దా! ఎలాగూ కేసీఆర్ వ్య‌తిరేక శ‌క్తుల్ని ఏకీకృతం చేయాల‌న్న‌ది రేవంత్ రెడ్డి ఆశయం క‌దా! వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు క‌దా! ఆ ఏకాభిప్రాయ‌మేదో ఈ అంశంతోనైనా మొద‌లౌతుందా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.