నంద్యాల క‌న్ఫ్యూజ‌న్.. ఇప్పుడు వైకాపాలో!

లాంఛ‌నం పూర్తైపోయింది! నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహ‌న్ రెడ్డి వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. పెద్ద సంఖ్య‌లో అనుచ‌రుల‌ను వెంట‌బెట్టుకుని వైకాపా కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న పార్టీలో చేరారు. శిల్పాతో స‌హా ప‌లువురు నేత‌లకు పార్టీ కండువాల‌ను క‌ప్పి, సాద‌రంగా ఆహ్వానించారు వైకాపా అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. అనంత‌రం మీడియాతో మాట్లాడిన శిల్పా య‌థావిధిగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. తెలుగుదేశంలో త‌న‌కు గుర్తింపు లేద‌నే ఉద్దేశంతోనే పార్టీ నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చేశామ‌న్నారు. వైకాపాలోకి రాగానే సొంత ఇంటికి వ‌చ్చిన‌ట్టుగా ఉంద‌ని శిల్పా అభివ‌ర్ణించారు. ఇక్క‌డితో ఒక అంకం ముగిసింది! అయితే, అస‌లు క‌థ ఇక్క‌డి నుంచే మొద‌లైంది. ఏ నంద్యాల ఉప ఎన్నిక అయితే టీడీపీలో ఇన్నాళ్లుగా చ‌ర్చ‌నీయంగా నిలిచిందో.. అదే అంశంపై ఇప్పుడు వైకాపా వ‌ర్గాల్లో కొత్త చ‌ర్చ‌కు దారితీస్తున్న‌ట్టు స‌మాచారం!

నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ తెలుగుదేశం టిక్కెట్ కోసం భూమా వ‌ర్గం, శిల్పా వ‌ర్గం పోటీప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రికి టిక్కెట్ ఇస్తారా అనే క‌న్ఫ్యూజ‌న్ ఇన్నాళ్లూ కొన‌సాగింది. శిల్పా టీడీపీని వీడ‌టంతో ఆ పార్టీ టిక్కెట్ పై క్లారిటీ వ‌చ్చేసింది! భూమా కుటుంబానికి చెందిన బ్ర‌హ్మానంద‌రెడ్డికి టీడీపీ టిక్కెట్ దాదాపు క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టే అని చెప్పాలి. అయితే, వైకాపా ఇప్పుడు ఎవ‌రికి టిక్కెట్ ఇస్తుంద‌న్న‌ది చ‌ర్చ‌నీయంగా మారింది. ఏదీ ఆశించ‌కుండానే వైకాపాలోకి వ‌చ్చాన‌ని శిల్పా చెబుతున్నా… తెలుగుదేశం పార్టీకి దూరం కావ‌డానికి కార‌ణం నంద్యాల టిక్కెట్టే క‌దా! సో.. ఆయ‌న వైకాపా నుంచి టిక్కెట్ ఆశించ‌కుండానే పార్టీలోకి వ‌చ్చారంటే న‌మ్మ‌డం సాధ్య‌మా..?

ఈ నేప‌థ్యంలో నంద్యాల టిక్కెట్ త‌న‌కే వ‌స్తుంద‌ని ఇన్నాళ్లూ ధీమాగా ఉన్న రాజ‌గోపాల్ రెడ్డి వ‌ర్గంలో క‌ద‌లిక మొద‌లైంద‌ని స‌మాచారం! దాదాపు 30 ఏళ్లుగా వైయ‌స్ కుటుంబంతో అనుబంధం ఉంద‌నీ, నంద్యాల టిక్కెట్ త‌న‌కే ఇస్తాన‌ని గ‌తంలో జ‌గ‌న్ చెప్పారంటూ నంద్యాల నియోజ‌క వ‌ర్గ ఇన్ ఛార్జ్ గా ఉన్న రాజ‌గోపాల్ మొన్న‌నే ఓ ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. పార్టీ కోసం తాను చాలా క‌ష్ట‌ప‌డ్డాన‌నీ, టిక్కెట్ విష‌యంలో గ‌తంలో ఇచ్చిన‌మాట‌ను జ‌గ‌న్ కు మ‌రోసారి గుర్తు చేస్తాన‌ని కూడా ఆయ‌న అన‌డం విశేషం. శిల్పా పార్టీలో చేరిన నేప‌థ్యంలో ఇప్పుడే వెళ్లి జ‌గ‌న్ ను క‌ల‌వాలంటూ రాజ‌గోపాల్ పై అనుచ‌రుల నుంచి ఒత్తిడి ఎక్కువౌతోంద‌ట‌! ఇంకా ఆల‌స్యం చేస్తే టిక్కెట్ విష‌యంలో జ‌గ‌న్ నిర్ణ‌యం మారే అవ‌కాశం ఉంటుందనీ, కాబ‌ట్టి త్వ‌ర‌గా ఈ అంశంపై అధినేత ప్ర‌క‌ట‌న చేసేలా ప్ర‌య‌త్నించాల‌ని కార్య‌క‌ర్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది.

టిక్కెట్ విష‌యంలో శిల్పా చేరిక వ‌ర‌కూ కాన్ఫిడెంట్ గా ఉంటూ వ‌చ్చిన రాజ‌గోపాల్‌.. ఇప్పుడు కాస్త త‌డ‌బ‌డుతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. శిల్పాకు నంద్యాల టిక్కెట్ ఇస్తామ‌ని జ‌గ‌న్ ప్రామిస్ చెసిన‌ట్టు చెప్ప‌డం లేదు! టీడీపీలో గుర్తింపు లేక‌పోవ‌డంతోనే వైకాపాకి వ‌చ్చామ‌నే శిల్పా కూడా అంటున్నారు. ఇంకోప‌క్క టిక్కెట్ పై రాజ‌గోపాల్ రెడ్డి చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రి, ఈ నేప‌థ్యంలో వైకాపా నుంచి టిక్కెట్ ఎవ‌రికి ద‌క్కుతుంది..? నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ వైకాపా అభ్య‌ర్థి ఎవ‌ర‌నే సందిగ్ధ‌త కొన‌సాగింది. ఇప్పుడు అక్క‌డా వ‌ర్గ‌పోరు మొద‌లైనట్టే కనిపిస్తోంది. రాజ‌గోపాల్ రెడ్డికి న‌చ్చ‌చెబితే ఆయ‌న త‌గ్గే అవ‌కాశాలు త‌క్కువ‌! ఎందుకంటే, పార్టీ ఇన్ ఛార్జ్ గా ఆయ‌న క్షేత్ర‌స్థాయిలో ప‌ని చేస్తున్నారు కాబ‌ట్టి! శిల్పాకి టిక్కెట్ ఇవ్వ‌క‌పోతే.. టీడీపీ ద‌గ్గ‌ర ఆ వ‌ర్గానికి ప‌రువు పోయినంత ప‌నౌతుంది! మ‌రి, ఈ ప‌జిల్ ను జ‌గ‌న్ ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.